LOADING...
Arshdeep Singh: అభిమానుల కోసమే మరిన్ని రీల్స్‌.. అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
అభిమానుల కోసమే మరిన్ని రీల్స్‌.. అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Arshdeep Singh: అభిమానుల కోసమే మరిన్ని రీల్స్‌.. అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 17, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

గత సీజన్‌లో ఫైనల్‌ వరకు దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్, ఈసారి ఐపీఎల్‌లో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించడంతో పాటు ఒక మ్యాచ్‌ రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టు ప్రదర్శనతో పాటు అభిమానుల మద్దతు కూడా గణనీయంగా పెరిగింది. ఈ అభిమానుల పెరుగుదలపై సరదాగా స్పందించిన పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌, తన సోషల్ మీడియా రీల్స్‌ వల్లే ఇది సాధ్యమైందని చెప్పాడు. ముంబయి ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్న అతడు, ఫ్యాన్స్‌తో తన అనుబంధం రీల్స్ ద్వారానే ఏర్పడిందని వివరించాడు. భవిష్యత్తులోనూ మరిన్ని రీల్స్‌ చేస్తానని వెల్లడించాడు.

వివరాలు

వంద వికెట్ల క్లబ్ లోకి అర్ష్‌దీప్

వాంఖడేలో కూడా పంజాబ్ కింగ్స్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీనికి ప్రధాన కారణం నా సోషల్ మీడియా. నాకు రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. వాటిని తరచూ పోస్టు చేస్తుంటా. ఆ రీల్స్ వల్లే చాలా మందికి నేను చేరువయ్యా. ముందుకు కూడా ఇదే కొనసాగిస్తా. అభిమానుల కోసం ఇంకా ఎన్నో రీల్స్ తీస్తా. అవి చూసి వారు ఎంజాయ్ చేస్తారని అర్ష్‌దీప్ చెప్పాడు. ఐపీఎల్‌లో 100వికెట్లు పూర్తి చేసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ చేరాడు. 87 మ్యాచుల్లోనే 102 వికెట్లు సాధించి ఈ మైలురాయిని అందుకున్నాడు. మ్యాచ్‌కు ముందు కోచ్ రికీ పాంటింగ్‌తో జరిగిన సంభాషణ కీలకమైందని అర్ష్ దీప్ తెలిపాడు.

వివరాలు

మెరుగుపడేందుకు కృషి చేస్తున్నా

"నేను అనుకున్న విధంగా బౌలింగ్ చేయలేకపోతున్నానని పాంటింగ్‌కు చెప్పా. టెక్నిక్ కంటే నా మీద నేను పెట్టుకున్న అంచనాలే మానసిక ఒత్తిడికి కారణమయ్యాయి. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడంలో పాంటింగ్‌తో చిట్‌చాట్ ఉపయోగపడిందని వివరించాడు. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి బౌలింగ్ చేయాలని పాంటింగ్ సూచించాడని తెలిపాడు. రికెల్టన్‌ను ఔట్ చేసిన బంతి ప్రత్యేకమని, వేరియేషన్‌తో ఆ డెలివరీ వేశానని చెప్పాడు. మహ్మద్ సిరాజ్ తరహాలో వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తున్నానని, అయితే తనదైన శైలిలో మెరుగుపడేందుకు కృషి చేస్తున్నానని తెలిపాడు. ముఖ్యంగా వైడ్ యార్కర్లను విసరడం తనకు అలవాటైందని, క్రీజ్‌లో స్థిరపడిన బ్యాటర్లను అదుపులో పెట్టడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని అర్ష్‌దీప్ వివరించాడు.

Advertisement