
Suresh Raina: వెండితెరపై మిస్టర్ ఐపీఎల్.. తమిళ చిత్రంతో సురేశ్ రైనా అరంగేట్రం!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడు. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఓ తమిళ చిత్రంతో రైనా సినీ రంగంలో అడుగుపెడుతున్నాడు. ఈసినిమాకు లోగాన్ దర్శకత్వం వహించగా, డ్రీమ్ నైట్ స్టోరీస్ (DKS) సంస్థ కింద శ్రవణ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రైనాని కథానాయకుడిగా తీసుకున్నట్లు డీకేఎస్ అధికారికంగా ప్రకటించింది. 'మిస్టర్ ఐపీఎల్'గా పేరుగాంచిన రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. తమిళనాడుతో ఆయనకు ఉన్న అనుబంధం వల్లే, తన అరంగేట్ర సినిమాను తమిళంలో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రకటన సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో క్రికెటర్ శివమ్ దూబే ప్రత్యేక అతిథిగా పాల్గొని సంస్థకు సంబంధించిన లోగోను ఆవిష్కరించాడు.
Details
పర్చువల్ హాజరైన సురేష్ రైనా
ఈ సమయంలో రైనా ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉండటంతో.. ఈవెంట్‌కు వర్చువల్‌గా హాజరయ్యాడు. క్రికెటర్లు సినిమాల్లోకి అడుగుపెడుతున్న సంగతి కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇర్ఫాన్ పఠాన్ 'కోబ్రా' అనే చిత్రంలో ఇంటర్‌పోల్ అధికారిగా నటించగా, హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్‌షిప్' చిత్రంలో కనిపించాడు. శిఖర్ ధావన్ కూడా బాలీవుడ్ సినిమాలో అతిథి పాత్రలో మెరిశాడు. శ్రీశాంత్ కూడా నటుడిగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తన నిర్మాణ సంస్థ 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్' ద్వారా 'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇప్పుడు రైనా కూడా సినిమా రంగంలోకి అడుగుపెడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. క్రికెట్‌ను తర్వాతి దశలో రైనా ఏ రంగంలో రాణిస్తాడో చూద్దాం!