LOADING...
MS Dhoni : ఎంఎస్. ధోనీ రీఎంట్రీపై కొత్త ట్విస్ట్.. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన మహీ!
ఎంఎస్. ధోనీ రీఎంట్రీపై కొత్త ట్విస్ట్.. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన మహీ!

MS Dhoni : ఎంఎస్. ధోనీ రీఎంట్రీపై కొత్త ట్విస్ట్.. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన మహీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంటున్నా, కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక విషయం మాత్రం ఇంకా నెరవేరలేదు. సీఎస్కే దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఎప్పుడూ బ్యాట్‌తో సత్తా చాటే ధోనీ, ఈసారి బంతితో నెట్స్‌లో కనిపించడంతో 'ధోనీ బ్యాటర్‌గా కాదు.. బౌలర్‌గా రీఎంట్రీ ఇస్తాడా?' అనే సందేహాలు మొదలయ్యాయి. సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌లో మే 10న లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన నెట్ ప్రాక్టీస్‌లో ధోనీ స్పిన్ బౌలింగ్ చేస్తూ కనిపించారు.

వివరాలు

ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు

సాధారణంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే ధోనీ, ఈసారి చిన్న రన్-అప్‌తో నవ్వుతూ సరదాగా బంతులు వేయడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం సరదా కోసమేనా? లేక నిజంగానే ధోనీ బౌలర్‌గా బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారా? అన్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సీజన్‌లో ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఫిట్‌నెస్ సమస్యలేనని సమాచారం. ముఖ్యంగా మోకాలి ఇబ్బంది కారణంగా ధోనీ వేగంగా పరుగులు తీయలేకపోతున్నారని, అందుకే తుది జట్టులో చోటు దక్కడం లేదని రిపోర్టులు చెబుతున్నాయి.

వివరాలు

పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేరు

గతంలో ఆయన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికీ, పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడేందుకు ఇంకా సిద్ధంగా లేరని తెలుస్తోంది. అయితే లక్నోతో జరిగే మ్యాచ్ నాటికి అయినా ధోనీ మైదానంలోకి దిగుతారని సీఎస్కే అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. సీజన్ ప్రారంభంలో వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న సీఎస్కే, ఆ తర్వాత పుంజుకుని మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు గెలవాల్సిన పరిస్థితి ఉంది.

Advertisement

వివరాలు

ధోని తిరిగొస్తే సీఎస్కేకు భారీ బలం

ఇలాంటి కీలక సమయంలో ధోనీ జట్టులోకి తిరిగి వస్తే సీఎస్కేకు భారీ బలం చేకూరుతుందని అభిమానులు భావిస్తున్నారు. ధోనీ రీఎంట్రీపై చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ కూడా స్పందించారు. ధోనీ ఎప్పుడు మైదానంలోకి దిగుతారనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని ఆయన తెలిపారు. ధోనీ ఫిట్‌నెస్‌ను నిరంతరం పరిశీలిస్తున్నామని, పూర్తిగా సిద్ధమయ్యాకే జట్టులోకి తీసుకుంటామని వెల్లడించారు. ఏదేమైనా, ధోనీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించడం మాత్రం అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ సీజన్‌లో కనీసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా అయినా ధోనీని చూసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement