IPL 2026: ఐపీఎల్‌లో హాట్ టాపిక్స్.. హార్దిక్ ఫిట్‌నెస్, కోహ్లీ ఫామ్‌పై మెక్‌గ్రాత్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ క్రమంగా ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు రెండేసి మ్యాచ్‌లతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ సమస్యలు ముంబయి ఇండియన్స్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సీఎస్‌కేలో ప్రశాంత్ వీర్ వినియోగం, అలాగే విరాట్ కోహ్లీపై గ్లెన్ మెక్‌గ్రాత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలుగా మారాయి. ఈ ఐపీఎల్‌కు సంబంధించిన ముఖ్య అంశాలను పరిశీలిద్దాం.
వివరాలు
హార్దిక్ పాండ్యా పరిస్థితేంటి?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించడం అనూహ్య పరిణామం. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇచ్చినట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. అయితే ఆ మ్యాచ్‌లో ముంబయి ఓటమిని చవిచూసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్ నాటికి పాండ్య తిరిగి జట్టులోకి వస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతని గైర్హాజరీ వల్ల ముంబయికి పేస్ ఆల్‌రౌండర్ లోటు తీవ్రంగా అనిపించింది.
వివరాలు
ఆ బౌలర్ల కథ అంతేనా?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రశాంత్ వీర్ అనే యువ ఆటగాడిని సీనియర్ రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు. ఇందుకోసం సీఎస్‌కే భారీగా రూ.14.2 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఇప్పటివరకు అతనితో బౌలింగ్ చేయించకపోవడం గమనించదగ్గ విషయం. ఇదే పరిస్థితి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కామెరూన్ గ్రీన్ విషయంలోనూ కనిపిస్తోంది. అతడిని కేకేఆర్ సుమారు రూ.25 కోట్లకు తీసుకున్నప్పటికీ, బౌలింగ్‌లో వినియోగించడం లేదు. దీంతో ప్రశాంత్ వీర్‌ను కామెరూన్ గ్రీన్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.
వివరాలు
నెట్టింట చర్చలు..
ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడంలో కెప్టెన్ రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీతో చివరి వరకు నిలబడి జట్టును విజయానికి చేర్చాడు. మ్యాచ్ అనంతరం ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌ను అభినందిస్తూ అతడిని ఆలింగనం చేసుకుని భుజం తట్టారు. గతంలో దిల్లీతో జరిగిన మ్యాచ్ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన తీవ్ర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
వివరాలు
ఇంతకీ గ్లెన్ మెక్ గ్రాత్ ఏమన్నాడంటే..
విరాట్ కోహ్లీ ప్రదర్శన, ఐపీఎల్‌లో పెరుగుతున్న భారీ స్కోర్లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ స్పందించాడు. కోహ్లీ వయసు పెరుగుతున్నప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని ఫామ్ ఇంకా అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. అలాగే ఈ ఐపీఎల్‌లో టాస్ కీలక అంశంగా మారిందని చెప్పాడు. ఎక్కువ జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. తమ కాలంలో 165-170 పరుగులు మంచి స్కోరుగా భావించేవారని, కానీ ఇప్పుడు 220 పరుగులు చేసినా గెలుపు ఖాయం కాదని అన్నాడు. లక్ష్య ఛేదనలో దిగే జట్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకావడం లేదని ఆయన విశ్లేషించాడు.