IPL 2023: ఐపీఎల్ లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీపై ముంబై విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 19.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 47 బంతుల్లో 6 ఫోర్లు సాయంతో 51 పరుగులు, అక్షర పటేల్ 25 బంతుల్లో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) 54 పరుగులతో విజృంభించారు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్ , పీయిష్ చావ్లా తలా మూడు వికెట్లతో చెలరేగారు.
హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇసాన్ కిషన్ చక్కగా రాణించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 71 పరుగులు జోడించారు. అనంతరం ఇసాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి దిగిన తిలక్ వర్మతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తిలక్ వర్మ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 65 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ముంబై ఇండియన్స్ రెండు పరుగులు తీసి విజయం సాధించింది.ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ముస్తాఫీర్ రెహ్మన్ ఒక వికెట్ తీశారు.