Loading...
Lakshya Raichandani: ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడటమే లక్ష్యం.. మనసులో మాట చెప్పిన అండర్-19 కెప్టెన్!
ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడటమే లక్ష్యం.. మనసులో మాట చెప్పిన అండర్-19 కెప్టెన్!

Lakshya Raichandani: ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడటమే లక్ష్యం.. మనసులో మాట చెప్పిన అండర్-19 కెప్టెన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 ఆసియా కప్ 2026లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ లక్ష్య రైచందాని తన ఐపీఎల్ కలను బయటపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ జట్టు తరఫున ఆడాలని కోరుకుంటున్నావని అడగ్గా.. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేరును చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) జట్లను కాకుండా సీఎస్‌కేను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఒమన్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన లక్ష్య.. 101 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

వివరాలు

సీఎస్‌కేనే ఎందుకు ఎంచుకున్నాడంటే?

ఆసియా కప్ విజయానంతరం క్రిక్‌ఇన్ఫోతో జరిగిన ఇంటరాక్షన్‌లో లక్ష్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.

ఐపీఎల్‌లో ఏ జట్టు తరఫున ఆడాలని అనుకుంటున్నావని అడగ్గా.. ఏమాత్రం తడుముకోకుండా చెన్నై సూపర్ కింగ్స్ అని సమాధానమిచ్చాడు.

ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ సీఎస్‌కేను ఎంచుకోవడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇదే ఇంటరాక్షన్‌లో మైదానంలో తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందనే ప్రశ్న కూడా అతడికి ఎదురైంది.

విరాట్ కోహ్లీలా దూకుడుగా ఉంటావా? లేక ఎంఎస్ ధోనీలా ప్రశాంతంగా ఉంటావా? అని అడిగారు. దీనికి లక్ష్య స్పందిస్తూ.. ధోనీ తరహా ప్రశాంతమైన ఆటతీరును ఇష్టపడుతున్నట్లు తెలిపాడు.

ఒత్తిడిలోనూ సంయమనం పాటించే ధోనీ నాయకత్వ శైలితో తనను పోల్చుకోవడం విశేషం.

వివరాలు

ధోనీలా ప్రశాంతంగా ఉంటాడు: కోచ్ మనీష్ ఝా

లక్ష్య ఆటతీరుపై ఉత్తరాఖండ్ హెడ్ కోచ్ మనీష్ ఝా కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

అతడు సెంచరీ చేసినా పెద్దగా సంబరాలు చేసుకోడని, సున్నాకే ఔటైనా కంగారుపడడని చెప్పాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటాడని వివరించాడు. 'ధోనీ కూడా మైదానంలో ఎక్కువగా భావోద్వేగాలు ప్రదర్శించేవాడు కాదు.

లక్ష్య కూడా అంతే. అతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. వికెట్ పడినప్పుడు కూడా పెద్దగా హడావుడి చేయడు' అని కోచ్ పేర్కొన్నాడు.

లక్ష్య మైదానంలో ఎక్కువగా మాట్లాడకపోయినా.. కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటాడని మనీష్ ఝా వెల్లడించాడు. జట్టులో తన ఆటతీరుతోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తాడని ప్రశంసించాడు.

ADVERTISEMENT