తొలి ఇండియన్‌గా చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. జావెలిన్ త్రోలో నంబర్ వన్ ర్యాంకును సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ గా అతను నిలవడం విశేషం. సోమవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో నీరజ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నంబర్ వన్ గా ఉన్న ఆండర్సన్ ఫీటర్స్ ను నీరజ్ వెనక్కినెట్టాడు. ఒలింపిక్స్ చరిత్రలో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో గోల్డ్ గెలిచిన అతను.. తాజాగా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ నీరజ్ 1445 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. అండర్సన్ 1433 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
పారిస్ ఒలింపిక్స్ లో విజేతగా నిలవడమే తన లక్ష్యం : నీరజ్ చోప్రా
2021లో జరిగిన టోక్సో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ మెగా ఈవెంట్లో జావెలిన్ ను 87.58 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. జ్యురిక్ లో జరిగిన డైమండ్ లీగ్ లో 89.63 మీటర్ల దూరం ఈటెను విసిరి గోల్డ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో గోల్డ్ గెలవడంతో ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అదే విధంగా 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా తాను కృషి చేస్తున్నట్లు దోహా ఈవెంట్ తర్వాత నీరజ్ వెల్లడించారు.