LOADING...
NED vs NAM: నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం.. గ్రూప్-Aలో పాకిస్థాన్‌కు షాక్
నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం.. గ్రూప్-Aలో పాకిస్థాన్‌కు షాక్

NED vs NAM: నమీబియాపై నెదర్లాండ్స్ ఘన విజయం.. గ్రూప్-Aలో పాకిస్థాన్‌కు షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో నెదర్లాండ్స్‌ జట్టు శుభారంభం చేసింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై నెదర్లాండ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే మైదానంలో ఫిబ్రవరి 12న నమీబియా జట్టు టీమిండియాతో తలపడనుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. నికోల్‌ లాఫ్టీ 42 పరుగులతో జట్టుకు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్‌ బౌలింగ్‌లో లోగాన్‌ వాన్‌ వైక్‌, లోగాన్‌ వాన్‌ బీక్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ఆర్యన్‌ దత్‌, ఫ్రెడ్‌ క్లాసెన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

Details

48 బంతుల్లో 72 పరుగులు చేసిన డి లీడే

157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ ఆశించినంత శుభారంభం చేయలేదు. పవర్‌ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే బాస్‌ డి లీడే బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. డి లీడే 48 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది అతని టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో నాల్గవ అర్ధశతకం కావడం విశేషం. మూడో వికెట్‌కు కాలిన్‌ అకెర్మాన్‌తో కలిసి 70 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన డి లీడే, అనంతరం కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌తో కలిసి నాల్గవ వికెట్‌కు అజేయంగా 43 పరుగులు జోడించాడు.

Details

గ్రూప్ Aలో భారత్ ఆగ్రస్థానం

ఫలితంగా నెదర్లాండ్స్‌ జట్టు 18వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్‌కు ఇది తొలి విజయం. అంతకుముందు వారు పాకిస్తాన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. రెండు మ్యాచ్‌ల అనంతరం రెండు పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్‌ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా గ్రూప్‌-Aలో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో పాకిస్తాన్‌ మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం గ్రూప్‌-Aలో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement