Sikandar Raza : అంతర్జాతీయ టీ20ల్లో కొత్త చరిత్ర.. సికిందర్ రజా అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
జింబాబ్వే కెప్టెన్ 'సికిందర్ రజా' అరుదైన రికార్డు సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు పడగొట్టిన తొలి జింబాబ్వే క్రికెటర్‌గా నిలిచాడు. గురువారం చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వ్యక్తిగతంగా 15 పరుగుల వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక మొత్తం అంతర్జాతీయ టీ20ల్లో 3000 పరుగులు, 100 వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా రజా రికార్డుల్లో నిలిచాడు. అతని కంటే ముందు ఈ ఘనతను మలేషియా ఆల్‌రౌండర్ వీరన్‌దీప్ సింగ్ మాత్రమే సాధించాడు.
Details
3వేల పరుగులు చేసిన 13వ ఆటగాడిగా రికార్డు
26 ఏళ్ల వీరన్‌దీప్ సింగ్ ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌ల్లో 3180 పరుగులు, 109 వికెట్లు నమోదు చేశాడు. రజా 132 మ్యాచ్‌ల్లో 3016 పరుగులు చేసి 104 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో 3000 పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు కూడా రజానే కావడం విశేషం. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన 14వ ఆటగాడిగా నిలిచాడు. బాబర్ అజామ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, పాల్ స్టిర్లింగ్, మార్టిన్ గుప్టిల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, వీరన్‌దీప్ సింగ్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్‌ల తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రజా పేరు నమోదు అయ్యింది.
Details
256 పరుగులు చేసిన భారత్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే... ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (55; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (50 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరావా, బ్లెస్సింగ్ ముజారబానీ, టినోటెండా మాపోసా, సికందర్ రజా తలా ఓ వికెట్ తీశారు. 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది.
Details
31 పరుగులతో రాణించిన సికిందర్ రజా
బ్రియాన్ బెన్నెట్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 నాటౌట్ చేసి శతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. సికిందర్ రజా 21 బంతుల్లో 31 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు సాధించగా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలా ఒక్క వికెట్ తీశారు. ఈ మ్యాచ్ రజాకు వ్యక్తిగతంగా చారిత్రాత్మకంగా నిలిచినా, జింబాబ్వే జట్టుకు మాత్రం ఫలితం అనుకూలంగా రాలేదు.