IND Vs NZ: రేపే న్యూజిలాండ్-భారత్ మ్యాచ్.. ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా తొలి సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. బుధవారం వాంఖేడే స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచు కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
ఒక్కో చోట 10వేల మంది వీక్షించేందుకు ఏర్పాట్లు
బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని భారీ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కోచోట దాదాపు 10వేల మంది వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ స్క్రీన్లపై మ్యాచును వీక్షించేందుకు ఉచితంగా ప్రవేశాన్ని కల్పించనున్నారు.