IND vs NZ : కేన్ లేని టూర్.. కెప్టెన్ మార్పుతో భారత్‌లో అడుగుపెడుతున్నకివీస్ !
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన జట్లను ప్రకటించింది. ఈ పర్యటన జనవరి 11న వడోదరలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రారంభం కానుంది,అనంతరం జనవరి 21 నుంచి నాగ్‌పూర్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ పర్యటనలో కివీస్ జట్టు యువ ఆటగాళ్లకు, అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేని ఆటగాళ్లకు ఎక్కువ అవకాశమిచ్చింది. ముఖ్యంగా, లెఫ్ట్-ఆర్మ్ పేస్ బౌలర్ జేడెన్ లెన్నాక్స్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. అలాగే క్రిస్టియన్ క్లార్క్, అదిత్య అశోక్, జోష్ క్లార్క్సన్ లాంటి యువ ఆటగాళ్లు భారత్ వంటి పెద్ద వేదికపై తమ ప్రతిభను చూపే అవకాశం దక్కించుకున్నారు.
వివరాలు
వన్డే జట్టు కెప్టెన్ గా ఆల్‌రౌండర్
న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ గజ్జల్లో గాయపడటంతో వన్డే సిరీస్ మొత్తం ఆడలేరని నిర్ధారమైంది. ఈ పరిస్థితిలో ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ వన్డే జట్టు నేతృత్వం చేపడతాడు. అయినప్పటికీ, బోర్డు భావించినట్లుగా శాంట్నర్ టీ20 సిరీస్ కోసం కోలుకొని కెప్టెన్‌గా కొనసాగుతాడు. ఇక స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఈ టూర్‌లో అందుబాటులో ఉండడంలేదు, అతను సౌతాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్లో ఆడుతున్నారు. అలాగే సీనియర్ బ్యాట్స్మన్ టామ్ లాథమ్ కూడా వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడం గమనార్హం.
వివరాలు
ప్రయోగాత్మక జట్టుతో న్యూజిలాండ్
గాయాల కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న మార్క్ చాప్‌మన్, మ్యాట్ హెన్రీ మళ్లీ జట్టులోకి చేరారు. అయితే, మ్యాట్ హెన్రీ వన్డే సిరీస్ ఆడక, రాబోయే టీ20 ప్రపంచకప్‌కి సిద్ధం కావడం కోసం కేవలం టీ20 సిరీస్‌కి మాత్రమే పరిమితం అవుతున్నాడు. అదే విధంగా, రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీలు బిజీ షెడ్యూల్ కారణంగా వన్డేలు ఆడడం లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే, న్యూజిలాండ్ జట్టు ఈసారి పూర్తిగా ప్రయోగాత్మక జట్టుతో భారత్ అడుగుపెట్టే పరిస్థితిలో ఉంది.
వివరాలు
న్యూజిలాండ్ స్క్వాడ్‌లు ఇవే
న్యూజిలాండ్ వన్డే స్క్వాడ్: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫాల్క్స్, మిచ్ హే (వికెట్ కీపర్), కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెన్నాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, విల్ యంగ్. న్యూజిలాండ్ టీ20 స్క్వాడ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), జాకబ్ డఫ్ఫీ, జాక్ ఫాల్క్స్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, బెవోన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఈష్ సోధి.