Michaung Cyclone : 30 గంటలు కరెంట్ లేదు: రవిచంద్రన్ అశ్విన్
చైన్నైని ముంచెత్తుతున్న మిచౌంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు అతలాకుతలమవుతోంది. తాజాగా ఈ తుఫాన్ ప్రభావం గురించి టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు. తాము ఉంటున్న నివాసంలో సుమారు 30 గంటలకు పైగా కరెంట్ లేదని అశ్విన్ ఎక్స్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మిగ్ జామ్ తుఫాన్ మంగళవారం తీరాన్ని దాటడటంతో చైన్నై నగరంలో జనజీవనం స్తంభించిపోయిందని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. వర్షం ఆగిపోయినా ప్రజలు కోలుకోవడానికి సమయం పడుతోందని, ఈ తుఫాన్ కారణంగా 12 మంది మరణించారన్నారు.
రీట్విట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్
ట్విటర్ లో ఓ నెటిజన్ తమ బంధువు అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయి కార్లు తేలియాడుతున్న ఫోటోను షేర్ చేశారు. వెలాచెర్రిలోని తన సోదరి ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో పరిస్థితి ఇలాగే ఉందని, రెండు రోజులుగా కరెంట్ లేదని, ఈ నగరంలో కరెంట్ పునరుద్ధరణ ఎప్పుడవుతుందో ఎవరైనా చెబుతారా అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన అశ్విన్ తమ ఏరియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ఇక్కడ కూడా 30గంటలకు పైగా కరెంట్ లేదని చెప్పాడు. మిగతా ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, తమకు ఏం ఆఫ్షన్స్ ఉన్నాయో తెలియడం లేదంటూ అశ్విన్ పేర్కొన్నాడు.