Loading...
IPL 2027: భారీ ధర పెట్టినా ఫలితం లేదా? ఈ ఐదుగురిని వదులుకునేందుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు!
భారీ ధర పెట్టినా ఫలితం లేదా? ఈ ఐదుగురిని వదులుకునేందుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు!

IPL 2027: భారీ ధర పెట్టినా ఫలితం లేదా? ఈ ఐదుగురిని వదులుకునేందుకు సిద్ధమైన ఫ్రాంచైజీలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ జట్లలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ 17న పది జట్లు తమ రిటెన్షన్‌, రిలీజ్‌ జాబితాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ట్రేడ్ల ద్వారా జట్లు మారారు. ఇప్పుడు భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ఎవరిని కొనసాగించాలి? ఎవరిని వదులుకోవాలి? అన్నది ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌ ప్రదర్శన, జట్టు అవసరాలు, మినీ వేలంలో అందుబాటులో ఉండే పర్స్‌ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఫ్రాంచైజీలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో రూ.10కోట్లకు పైగా ధర పలికిన ఐదుగురు ఆటగాళ్ల పేర్లు సంభావ్య విడుదల జాబితాలో చర్చకు వస్తున్నాయి.

వివరాలు

1. కామెరూన్‌ గ్రీన్‌ - కోల్‌కతా నైట్‌రైడర్స్

2026 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కామెరూన్‌ గ్రీన్‌ను రూ.25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడిపై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది.

అయితే గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన గ్రీన్‌ 322 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీశాడు.

ఈ గణాంకాలు మరీ పేలవంగా లేకపోయినా.. అతడి కోసం వెచ్చించిన భారీ మొత్తానికి తగ్గ ప్రదర్శన చేశాడా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మినీ వేలానికి ముందు పర్స్‌లో ఎక్కువ డబ్బు ఉంచుకోవాలని భావిస్తే.. కోల్‌కతా అతడిని విడుదల చేసే అవకాశాన్ని పరిశీలించవచ్చనే అంచనాలు ఉన్నాయి.

వివరాలు

2. ట్రెంట్‌ బౌల్ట్‌ - ముంబై ఇండియన్స్

న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ముంబై ఇండియన్స్‌కు కీలక బౌలర్‌. అతడి కోసం ఫ్రాంచైజీ రూ.12.50 కోట్లు ఖర్చు చేసింది.

అయితే 2026 సీజన్‌లో బౌల్ట్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.

అతడి బౌలింగ్‌ ఎకానమీ కూడా 11.63గా నమోదైంది. గతంలో కొత్త బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన బౌల్ట్‌ నుంచి ఈసారి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో.. ముంబై యాజమాన్యం అతడి కొనసాగింపుపై మరోసారి ఆలోచించే అవకాశం ఉందని అంచనా.

ADVERTISEMENT

వివరాలు

3. ప్రశాంత్‌ వీర్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్

యువ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2026 వేలంలో రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. రవీంద్ర జడేజా జట్టును వీడిన తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిగా ప్రశాంత్‌పై సీఎస్కే ఆశలు పెట్టుకుంది.

అయితే గత సీజన్‌లో అతడికి బౌలింగ్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదు. బ్యాటింగ్‌లోనూ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులే చేశాడు.

భారీ ధరకు తీసుకున్న ఆటగాడి నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశించిన చెన్నై.. మినీ వేలానికి ముందు అతడి విషయంలో మరోసారి ఆలోచించవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ADVERTISEMENT

వివరాలు

4. మార్కస్‌ స్టొయినిస్‌ - పంజాబ్‌ కింగ్స్

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.11 కోట్లకు తీసుకుంది.

అయితే 2027 సీజన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యా పంజాబ్‌ జట్టులోకి రావడంతో ఆల్‌రౌండర్ల ఎంపికపై చర్చ మొదలైంది.

ఇప్పటికే మార్కో జాన్సెన్‌ వంటి ఆటగాడు జట్టులో ఉండటంతో విదేశీ ఆల్‌రౌండర్లందరికీ తుది జట్టులో చోటు కల్పించడం కష్టమవుతుంది.

ఈ పరిస్థితుల్లో స్టొయినిస్‌ను కొనసాగించాలా? లేక అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవాలా? అన్నది పంజాబ్‌ యాజమాన్యం ముందున్న ప్రశ్న. దీంతో అతడి పేరు కూడా సంభావ్య విడుదల జాబితాలో వినిపిస్తోంది.

వివరాలు

5. జితేశ్‌ శర్మ - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.11 కోట్లకు కొనసాగిస్తోంది.

అయితే గత రెండు సీజన్లలో అతడి నుంచి ఆశించిన స్థాయిలో పరుగులు రాలేదనే అభిప్రాయం ఉంది. 31 మ్యాచ్‌ల్లో 377 పరుగులు మాత్రమే చేయడంతో అతడి బ్యాటింగ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ స్థానం కీలకం కావడంతో.. ఆర్సీబీ ఈసారి కొత్త ఎంపికల వైపు చూస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే జితేశ్‌ను విడుదల చేస్తారనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

వివరాలు

డిసెంబర్‌ 16న మినీ వేలం

ఐపీఎల్‌ 2027 మినీ వేలం డిసెంబర్‌ 16న గోవాలో జరగనున్నట్లు సమాచారం.

రిటెన్షన్‌ జాబితాలు వెల్లడైన తర్వాత ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు మిగులుతుంది? ఏ స్థానాల్లో ఆటగాళ్ల అవసరం ఉంది? అనే విషయాలపై స్పష్టత రానుంది.

కామెరూన్‌ గ్రీన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రశాంత్‌ వీర్‌, మార్కస్‌ స్టొయినిస్‌, జితేశ్‌ శర్మ పేర్లు ప్రస్తుతం చర్చలో ఉన్నప్పటికీ.. వీరిలో ఎవరిని విడుదల చేస్తారనేది అధికారిక జాబితా వచ్చిన తర్వాతే తేలనుంది.

ADVERTISEMENT