LOADING...
RCB: కోహ్లీ కాదు, పటీదార్ కాదు.. ఆర్సీబీ తలరాత మార్చిన అసలైన హీరో ఇతడే!
కోహ్లీ కాదు, పటీదార్ కాదు.. ఆర్సీబీ తలరాత మార్చిన అసలైన హీరో ఇతడే!

RCB: కోహ్లీ కాదు, పటీదార్ కాదు.. ఆర్సీబీ తలరాత మార్చిన అసలైన హీరో ఇతడే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు "ఈ సాలా కప్ నమదే" అనే నినాదంతోనే పరిమితమైన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) ఇప్పుడు ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు (2025, 2026) ఛాంపియన్‌గా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ దశాబ్దానికి పైగా టైటిల్ కోసం ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానుల కలను నిజం చేసిన వ్యక్తి హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్. పేరులో 'ఫ్లవర్' ఉన్నా, ఆర్సీబీ తలరాతను పూర్తిగా మార్చేసిన నిశ్శబ్ద విప్లవకారుడిగా అతడు నిలిచాడు. ఆగస్టు 2023లో ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో జట్టు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది.

వివరాలు

బౌలింగ్ ను బలోపేతం చేయడంలో ఫ్లవర్ ప్రత్యేక దృష్టి

స్టార్ ఆటగాళ్లపై అధికంగా ఆధారపడే జట్టుగా పేరున్న ఆర్సీబీ, కాగితంపై బలంగా కనిపించినప్పటికీ మైదానంలో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయేది. ఈ పరిస్థితిని మార్చడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఫ్లవర్, వ్యక్తిగత ప్రతిభ కంటే జట్టు సమష్టి విజయానికే ప్రాధాన్యత ఇచ్చాడు. టీమ్ స్ట్రక్చర్, జట్టు సంస్కృతి, సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాడు. అతని మార్పులు కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలోనూ స్పష్టంగా కనిపించాయి. ఏళ్ల తరబడి ఆర్సీబీని వెంటాడిన బలహీనమైన బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంపై ఫ్లవర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. 2025 వేలానికి ముందు రూ.10.75 కోట్లకు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకురావడం అతని కీలక వ్యూహాత్మక నిర్ణయాల్లో ఒకటి.

వివరాలు

ఆండీ ఫ్లవర్ నాయకత్వంపై పటీదార్ ప్రశంసలు

ఆ నమ్మకాన్ని నిలబెడుతూ భువనేశ్వర్ గత రెండు సీజన్లలో కలిపి 45 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలోనూ ఫ్లవర్ ముందంజలో నిలిచాడు. రసిఖ్ సలామ్ ధార్ వంటి యువ ఆటగాడికి అవకాశమివ్వగా, అతడు 2026 సీజన్‌లో 19 వికెట్లు తీసి తన ప్రతిభను నిరూపించాడు. ఫ్లవర్ హయాంలో తుది జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకే కాకుండా బెంచ్‌పై ఉన్న వారికి కూడా సమాన ప్రాధాన్యత లభించింది. ఆండీ ఫ్లవర్ నాయకత్వంపై ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ప్రశంసలు కురిపించాడు. "నేను ఆడిన ఐపీఎల్ సీజన్లలో ఆండీ ఫ్లవర్ అత్యుత్తమ కోచ్. ప్రతి ఆటగాడితో వ్యక్తిగతంగా సమయం గడుపుతాడు.

Advertisement

వివరాలు

75 పరుగులతో నాటౌట్ గా నిలిచిన విరాట్ కోహ్లీ

ఆడేవారైనా, బెంచ్‌లో ఉన్నవారైనా అందరినీ సమానంగా చూస్తాడు. యువ ఆటగాళ్లకు స్పష్టతనిచ్చి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడంలో అతడికి అతడే సాటినని పేర్కొన్నాడు. 2026 ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఛేదించి విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆటగాళ్లు మైదానంలో మెరిసినా, తెరవెనుక ఉండి విజయానికి అవసరమైన వ్యూహరచన చేసిన వ్యక్తి మాత్రం ఆండీ ఫ్లవర్. ఇంగ్లండ్ జట్టుకు యాషెస్ సిరీస్, టీ20 ప్రపంచకప్ అందించిన కోచ్‌గా, అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు ఫ్రాంచైజీ లీగ్‌లలో విజయవంతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఫ్లవర్‌పై ఆర్సీబీ యాజమాన్యం నమ్మకం ఉంచింది.

Advertisement

వివరాలు

ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన ఆర్సీబీ

ఆ నమ్మకాన్ని అతడు వరుసగా రెండు టైటిళ్లు అందించి నిలబెట్టుకున్నాడు. దీంతో ఆర్సీబీ ఇప్పుడు కేవలం ఒక జట్టు మాత్రమే కాదు, ఫ్లవర్ తీర్చిదిద్దిన ఛాంపియన్ల సైన్యంగా మారింది. ఇప్పుడు 2027లో వరుసగా మూడో టైటిల్ సాధించి, ఐపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా నిలవాలనే లక్ష్యంతో ఆర్సీబీ ముందుకు సాగుతోంది. కాగా, గత రాత్రి ఫైనల్ విజయం అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సెలబ్రేషన్స్‌లో భాగంగా ఐస్ బాక్స్‌లోని ఐస్ క్యూబ్‌లను హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ తలపై కుమ్మరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ ఆండీ ఫ్లవర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

వివరాలు

63 మ్యాచుల్లో 4,794 పరుగులు

ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, నమ్మకమైన వికెట్ కీపర్‌గా దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో తన ముద్ర వేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ఫ్లవర్ 63 మ్యాచ్‌లు ఆడి 51.54 సగటుతో 4,794 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 232 నాటౌట్. వికెట్ కీపర్‌గా 151 క్యాచ్‌లు, 9 స్టంపింగ్‌లు నమోదు చేశాడు. వన్డేల్లో 213 మ్యాచ్‌లు ఆడి 35.34 సగటుతో 6,786 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వికెట్ల వెనుక 141 క్యాచ్‌లు, 32 స్టంపింగ్‌లతో జట్టుకు అండగా నిలిచాడు.

వివరాలు

లిస్ట్-ఎ క్రికెట్‌లో 12 వేలకుపైగా పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్‌లోనూ ఫ్లవర్ పరుగుల వరద పారించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 16 వేలకుపైగా, లిస్ట్-ఎ క్రికెట్‌లో 12 వేలకుపైగా పరుగులు సాధించి తన నిలకడను చాటుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, నమ్మకమైన వికెట్ కీపింగ్‌తో ఆండీ ఫ్లవర్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు.

Advertisement