IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ జట్టు జనవరి 11 నుంచి భారత్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రెండు జట్లు మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇదిలా ఉండగా, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. అదే జట్టు న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో పాల్గొననుంది. అయితే న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సంబంధించి ఇప్పటివరకు భారత జట్టును అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Details
వన్డే సిరీస్ కు విశ్రాంతినిచ్చే అవకాశం
తాజా సమాచారం ప్రకారం స్టార్ ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యకు ఈ వన్డే సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా, అలాగే 2026 టీ20వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని, ఆ సమయానికి వారు పూర్తిగా ఫిట్‌గా ఉండేలా ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా వికెట్‌కీపర్ స్థానం విషయంలోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ స్థానంలో ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ లేదా జితేశ్ శర్మను జట్టులోకి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే ఇషాన్ కిషన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Details
దేశవాళీ టోర్నీలో తప్పనిసరిగా పాల్గొనాలి
హార్దిక్ పాండ్య విషయానికొస్తే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఆయన మళ్లీ వన్డే జట్టులోకి ఎంపిక కాలేదు. అలాగే జస్‌ప్రీత్ బుమ్రా కూడా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత నుంచి ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదిలా ఉండగా, టీమ్ ఇండియా ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్న నిబంధనను బీసీసీఐ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య విజయ్‌హజారే ట్రోఫీలో భాగంగా బరోడా జట్టు తరఫున ఆడనున్నాడు. జనవరి 3, 6, 8 తేదీల్లో రాజ్‌కోట్ వేదికగా బరోడా చివరి మూడు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో పాండ్య కనీసం రెండింట్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.