ODI World Cup 2027: రెండు సార్లు ఛాంపియన్… కానీ వరల్డ్ కప్‌కు దూరం?
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచంలో ఒక జట్టు విజయం, మరో జట్టు భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో చూపించే తాజా ఉదాహరణ ఇదే. పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో 290 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుతూ, బంగ్లాదేశ్ జట్టు 11 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై గెలిచింది. ఈ విజయం బంగ్లాదేశ్‌కు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కు ఇది పెద్ద దెబ్బగా మారింది. ఈ సిరీస్ ఫలితం 2027 వన్డే వరల్డ్ కప్ డైరెక్ట్ క్వాలిఫికేషన్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.
వివరాలు
అర్హత సాధించాల్సిందే..
2027 వన్డే వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు కలిసి నిర్వహించనున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఆతిథ్య హోదాతో దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన స్థానాల కోసం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ కీలకంగా మారనున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉన్న జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి. దక్షిణాఫ్రికా ఇప్పటికే టాప్ 8లో ఉండటంతో, 9వ స్థానంలో ఉన్న జట్టుకూ నేరుగా అవకాశం లభిస్తుంది. అయితే 10వ స్థానం లేదా అంతకంటే దిగువ స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడి టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది.