
Aman Sehrawat: ఒలింపిక్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్‌పై ఏడాది నిషేధం.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని పెంచిన యువ రెజ్లర్ 'అమన్ సెహ్రావత్'కు భారీ షాక్ తగిలింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) క్రమశిక్షణా చర్యగా అతనిపై ఒక సంవత్సరం నిషేధం విధించింది. క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాఖ్య వెల్లడించింది. ఇటీవల క్రొయేషియాలో సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు జరిగిన సీనియర్ ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమన్ పాల్గొనాల్సి ఉంది. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడాల్సిన అమన్, బరువు తూకం సమయంలో నిర్దేశిత పరిమితిని 1.7 కిలోల మేర మించిపోవడంతో అనర్హుడిగా ప్రకటించారు.
Details
అమన్‌కు షోకాజ్ నోటీసు జారీ
ఫలితంగా భారత తరఫున ఈ టోర్నీలో కేవలం అంతిమ్ పంఘల్ (మహిళల 53 కేజీల విభాగం) మాత్రమే కాంస్య పతకం సాధించింది. ఈ ఘటనను తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించిన WFI, సెప్టెంబర్ 23న అమన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన సెప్టెంబర్ 29న సమాధానం ఇచ్చినప్పటికీ, అది సంతృప్తికరంగా లేదని క్రమశిక్షణ కమిటీ తేల్చింది. ఒలింపిక్ పతక విజేతగా ఉండి కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో WFI దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రెజ్లింగ్ పోటీల నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తున్నామని లేఖ ద్వారా స్పష్టం చేసింది. ఈ కాలంలో సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఏ టోర్నీలోనూ అమన్ పాల్గొనలేడు.