Loading...
Mohammed Siraj: రెండు టెస్టుల్లోనూ బెంచ్‌కే.. సిరాజ్ అరుదైన రికార్డు బ్రేక్
రెండు టెస్టుల్లోనూ బెంచ్‌కే.. సిరాజ్ అరుదైన రికార్డు బ్రేక్

Mohammed Siraj: రెండు టెస్టుల్లోనూ బెంచ్‌కే.. సిరాజ్ అరుదైన రికార్డు బ్రేక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు నిరాశ ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అతడు.. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో భారత జట్టు ఎంపికపై చర్చ మొదలైంది. అంతేకాదు.. సిరాజ్ కెరీర్‌లో కొనసాగుతున్న ఓ అరుదైన రికార్డుకు కూడా తెరపడింది. 2020లో టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విదేశాల్లో భారత్ ఆడిన ప్రతి టెస్టు సిరీస్‌లోనూ సిరాజ్ కనీసం ఒక మ్యాచ్‌లో అయినా బరిలోకి దిగాడు. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ పరంపరకు న్యూజిలాండ్‌తో ప్రస్తుత సిరీస్‌లో బ్రేక్ పడింది.

వివరాలు

48 టెస్టుల్లో 144 వికెట్లు

తొలి రెండు టెస్టుల్లోనూ తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతడి రికార్డు ముగిసింది. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున 48 టెస్టులు ఆడి 144 వికెట్లు పడగొట్టాడు.

అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/15. టెస్టుల్లో ఎనిమిది సార్లు నాలుగు వికెట్లు, ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

సిరాజ్‌తో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా రెండో టెస్టు తుది జట్టులోకి తీసుకోకపోవడంపై పలువురు క్రికెట్ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు

జడేజాను పక్కన పెట్టడంపై గవాస్కర్ అసంతృప్తి

టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం జట్టు ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్రైస్ట్‌చర్చ్ టెస్టులో జడేజాను పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మాట్లాడిన గవాస్కర్.. ప్రస్తుత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో జడేజా 33 వికెట్లతో భారత్ తరఫున మూడో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడని గుర్తుచేశారు.

హాగ్లీ ఓవల్ వంటి పిచ్‌లపై నాలుగో, ఐదో రోజు అతడి స్పిన్ బౌలింగ్ ఎంతో ఉపయోగపడేదని పేర్కొన్నారు. బంతిని గాల్లోకి ఎక్కువగా విసరకుండానే పిచ్‌పై పట్టించి తిప్పగల సామర్థ్యం జడేజాకు ఉందని వివరించారు.

ADVERTISEMENT