LOADING...
IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం గిల్-సాయి సుదర్శన్ పోటీ.. చివరికి పైచేయి ఎవరిదంటే?
ఆరెంజ్ క్యాప్ కోసం గిల్-సాయి సుదర్శన్ పోటీ.. చివరికి పైచేయి ఎవరిదంటే?

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ కోసం గిల్-సాయి సుదర్శన్ పోటీ.. చివరికి పైచేయి ఎవరిదంటే?

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండటంతో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్ మరింత ఉత్కంఠగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 66వ లీగ్ మ్యాచ్‌లో జట్టు విజయం మాత్రమే కాదు.. వ్యక్తిగత రికార్డుల పోటీ కూడా హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ మధ్య ఆరెంజ్ క్యాప్ కోసం జరిగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆరెంజ్ క్యాప్ ఒకరి నుంచి మరొకరి చేతికి మారడం మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

వివరాలు

చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డ సాయి సుదర్శన్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ తరఫున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో గిల్ ఈ సీజన్‌లో మొత్తం 616 పరుగులు పూర్తి చేశాడు. దీంతో అప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న వైభవ్ సూర్యవంశీని వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ రేస్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. అయితే గిల్ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

వివరాలు

గిల్ దాటేసిన సాయి సుదర్శన్..

కేవలం 53 బంతుల్లోనే 84 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో ఈ సీజన్‌లో అతని మొత్తం పరుగులు 638కు చేరాయి. ఫలితంగా గిల్‌ను దాటేసి సాయి సుదర్శన్ మళ్లీ ఆరెంజ్ క్యాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేస్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లదే హవా కనిపిస్తోంది. సాయి సుదర్శన్ 638 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, శుభ్‌మన్ గిల్ 616 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ 13 మ్యాచ్‌ల్లో 579 పరుగులతో మూడో స్థానానికి పడిపోయాడు. అయితే అతనికి ఇంకా ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉండటంతో మళ్లీ టాప్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

వివరాలు

పర్పుల్ క్యాప్ కోసం పోటీ..

ఇక మిచెల్ మార్ష్ 563 పరుగులతో నాల్గో స్థానంలో ఉండగా, హెన్రిచ్ క్లాసెన్ 555 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు పర్పుల్ క్యాప్ రేస్ కూడా ఆసక్తికరంగా మారింది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇచ్చే ఈ క్యాప్ కోసం ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడు. భువీ 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబాడా మూడు వికెట్లు తీసి మొత్తం 24 వికెట్లతో భువీ సరసన చేరాడు. ఎకానమీ రేట్‌లో భువనేశ్వర్ మెరుగ్గా ఉండటంతో పర్పుల్ క్యాప్ అతని వద్దే ఉంది. అన్షుల్ కాంబోజ్ 21 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement