LOADING...
Asia Cup: ఛేదనలో విఫలమైన బంగ్లా.. ఫైనల్ కి చేరిన పాకిస్థాన్ 
ఛేదనలో విఫలమైన బంగ్లా.. ఫైనల్ కి చేరిన పాకిస్థాన్

Asia Cup: ఛేదనలో విఫలమైన బంగ్లా.. ఫైనల్ కి చేరిన పాకిస్థాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ టీ20 టోర్నీలో మూడోసారి భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరగబోతోంది. పాకిస్థాన్‌ కూడా ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్‌తో నిర్ణయాత్మక సూపర్‌ 4 మ్యాచ్‌లో బ్యాటుతో తడబడ్డప్పటికీ అద్భుత బౌలింగ్‌తో పాక్‌ గట్టెక్కింది. 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 124 పరుగులకే కుప్పకూలింది. షహీన్‌ షా అఫ్రిది (3/17), హారిస్‌ రవూఫ్‌ (3/33), సైమ్‌ అయూబ్‌ (2/16) అద్భుత బౌలింగ్‌తో బంగ్లా బ్యాట్స్‌మన్‌లను నిలువనీయలేదు. తొలి ఓవర్లోనే ఓపెనర్‌ ఎమాన్‌ (0) ఔటవడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. షమిమ్‌ (30; 25 బంతుల్లో 2×6) పోరాటం సరిపోలేదు.

వివరాలు 

పాకిస్థాన్‌ కూడా బ్యాటుతో కష్టపడింది

ఇక అంతకుముందు పాకిస్థాన్‌ బ్యాటింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ జట్టు 8 వికెట్లకు 135 పరుగులకే పరిమితమైంది. మొత్తం ఇన్నింగ్స్‌లోనూ పాక్‌ జోరు అందుకోలేకపోయింది. తరచూ వికెట్లు చేజార్చుకున్నా చివరకు 135 పరుగులు చేయడం అదృష్టమే. ఒక దశలో 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పరిస్థితి నుంచి హారిస్‌ (31; 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రక్షించాడు. అతను షహీన్‌ షా అఫ్రిది (19)తో కలిసి ఆరో వికెట్‌కు 22 పరుగులు,నవాజ్‌ (25; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు)తో ఏడో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు.

వివరాలు 

ఆదివారం ఫైనల్‌ 

అష్రాఫ్‌ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ (3/28), రిషాద్‌ హొస్సేన్‌ (2/18), మెహదీ హసన్‌ (2/28) పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌లను కట్టడి చేశారు. ఆసియా కప్‌ ఫైనల్‌ ఈ ఆదివారం జరగనుంది. సంక్షిప్త స్కోర్లు... పాకిస్థాన్‌: 135/8 (హారిస్‌ 31, నవాజ్‌ 25, షహీన్‌ అఫ్రిది 19, సల్మాన్‌ ఆఘా 19; తస్కిన్‌ 3/28, రిషాద్‌ 2/18, మెహదీ హసన్‌ 2/28); బంగ్లాదేశ్‌: 124/9 (షమిమ్‌ 30, సైఫ్‌ 18, నురుల్‌ 16, రిషాద్‌ 16; షహీన్‌ అఫ్రిది 3/17, రవూఫ్‌ 3/33; సైమ్‌ అయూబ్‌ 2/16)