Loading...
Pakistan: పాక్‌ క్రికెటర్లను అక్రమ వలసదారులుగా భావించి.. హోటల్‌ వద్ద నిరసన
పాక్‌ క్రికెటర్లను అక్రమ వలసదారులుగా భావించి.. హోటల్‌ వద్ద నిరసన

Pakistan: పాక్‌ క్రికెటర్లను అక్రమ వలసదారులుగా భావించి.. హోటల్‌ వద్ద నిరసన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు అనుకోని పరిస్థితి ఎదురైంది. దక్షిణ ఇంగ్లాండ్‌లోని పోర్ట్స్‌మౌత్‌ కోషమ్‌లోని ఓ హోటల్‌లో బస చేసేందుకు వచ్చిన పాక్‌ యువ క్రికెటర్లను కొందరు యాంటీ-ఇమిగ్రెంట్‌ ఉద్యమకారులు అక్రమ వలసదారులుగా పొరబడ్డారు. దీంతో హోటల్‌ వెలుపల ఒక్కసారిగా నిరసనకారులు గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది.

వివరాలు 

సుమారు 30 నుంచి 40 మంది వరకు..

పాక్‌ జట్టు బస్సులో హోటల్‌కు చేరుకుని లోపలికి వెళ్తున్న సమయంలో.. అక్కడికి సుమారు 30 నుంచి 40 మంది వరకు నిరసనకారులు చేరుకున్నారు.

వారిలో పలువురు ముఖాలకు మాస్కులు, బాలక్లావాలు ధరించినట్లు సమాచారం.

హోటల్‌లోకి విదేశీయులైన కొందరు వ్యక్తులు వచ్చారనే సమాచారంతో వారంతా అక్కడికి చేరుకున్నారు.

అయితే.. హోటల్‌లో బస చేస్తున్నది ఎవరనే విషయంపై సరైన సమాచారం లేకపోవడంతో ఈ గందరగోళం ఏర్పడింది.

వాస్తవానికి అక్కడ ఉన్నవారు పాకిస్థాన్‌ అండర్‌-19 క్రికెట్‌ జట్టు సభ్యులు. వారు ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా దక్షిణ తీర ప్రాంతంలో మ్యాచ్‌లు ఆడేందుకు అక్కడికి వచ్చారు.

వివరాలు 

విషయం వివరించిన కౌన్సిలర్‌..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక కౌన్సిలర్‌ జార్జ్‌ మాడ్గివిక్‌ హోటల్‌కు చేరుకున్నారు.

తొలుత హోటల్‌ మేనేజర్‌తో మాట్లాడి అక్కడ బస చేస్తున్నవారు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన ఆటగాళ్లని నిర్ధారించుకున్నారు.

అనంతరం జట్టు కోచ్‌తోనూ మాట్లాడారు. హోటల్‌ సిబ్బంది ఆటగాళ్లు క్రికెటర్లేనని నిర్ధారించే ఆధారాలను కూడా చూపించినట్లు ఆయన తెలిపారు.

ఆ తర్వాత బయట ఉన్న నిరసనకారుల వద్దకు వెళ్లిన మాడ్గివిక్‌.. ''మీరు పొరపాటు పడ్డారు.. వారు క్రికెట్‌ జట్టు సభ్యులు'' అని వివరించారు.

విషయం అర్థం చేసుకున్న నిరసనకారులు కొద్ది నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని మాడ్గివిక్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

వైరల్‌ ఫొటోతోనే గందరగోళం..

ఈ మొత్తం వ్యవహారానికి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ ఫొటో కారణమని మాడ్గివిక్‌ తెలిపారు.

విదేశీయుల్లా కనిపిస్తున్న కొందరు వ్యక్తులు బస్సు నుంచి దిగుతున్న దృశ్యాన్ని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో పోస్టు చేయడంతో.. అది తప్పుడు అర్థాలతో వేగంగా ప్రచారంలోకి వెళ్లిందని చెప్పారు.

వాస్తవాలను నిర్ధారించుకోకుండానే సమాచారం వ్యాప్తి చెందడంతో ఈ సమస్య తలెత్తిందని వివరించారు.

అంతేకాకుండా.. పాక్‌ జట్టును తీసుకొచ్చిన బస్సు సంస్థ గతంలో పోర్ట్స్‌మౌత్‌కు వచ్చిన శరణార్థులను తరలించేందుకు కూడా ఉపయోగించిందని మాడ్గివిక్‌ చెప్పారు.

దీంతో అప్పటికే వలసల అంశంపై ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో అనుమానం మరింత పెరిగిందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

తప్పుడు సమాచారంపై ఎంపీ ఆందోళన..

పోర్ట్స్‌మౌత్‌ నార్త్‌ ఎంపీ అమందా మార్టిన్‌ కూడా ఈ ఘటనపై స్పందించారు.

వలసలపై చర్చలు వాస్తవాలు, ఆధారాల ఆధారంగా జరగాలి తప్ప.. పుకార్లు, తప్పుడు సమాచారంపై ఆధారపడకూడదని ఆమె పేర్కొన్నారు.

తప్పుడు సమాచారం కారణంగా యువ క్రికెటర్లను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.

క్రికెట్‌ బోర్డుల స్పందన..

ఈ ఘటనపై ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు కూడా స్పందించింది.

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డును సంప్రదించి అండర్‌-19 ఆటగాళ్ల భద్రత, సంక్షేమంపై ఆరా తీసింది. పర్యటనలో మిగిలిన మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్లను కూడా సమీక్షిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT