Asia Cup Rising Stars: సూపర్ ఓవర్‌లో పాక్ షాహీన్స్ గెలుపు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ షాహీన్స్ కిరీటం సొంతం చేసుకుంది. దోహా వేదికగా ఆదివారం జరిగిన రసవత్తర ఫైనల్లో బంగ్లాదేశ్-ఏపై సూపర్ ఓవర్‌లో విజయం సాధిస్తూ పాక్ యువ జట్టు ట్రోఫీని ముద్దాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ షాహీన్స్ నిర్ణీత 20ఓవర్లలో 125 పరుగులకు పరిమితమైంది. సాద్ మసూద్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38), అర్ఫత్ మిన్హాస్ (23బంతుల్లో25), మాజ్ సదఖత్ (18 బంతుల్లో 23) మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్-ఏ బౌలర్లలో రిపన్ మోండల్ (3/25) మూడు వికెట్లు సాధించగా, రకిబుల్ హసన్ (2/16) రెండు వికెట్లు తీశాడు. మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫ్ఫార్ సక్లెయిన్ తలో వికెట్ తీసారు.
Details
125 పరుగులు చేసిన బంగ్లాదేశ్- ఏ
బంగ్లాదేశ్-ఏ కూడా అదే తరహాలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేసింది. హబిబుర్ రెహ్మాన్ సోహన్ (17 బంతుల్లో 26), రకిబుల్ హసన్ (21 బంతుల్లో 24) ప్రధాన స్కోరర్లు. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీమ్ (3/11) అద్భుతంగా రాణించగా, అర్ఫత్ మిన్హాస్ (2/5), అహ్మద్ దనియాల్ (2/11) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. చివరి ఓవర్‌లో బంగ్లాదేశ్‌కు విజయానికి 7 పరుగులు అవసరం. అయితే అహ్మద్ దనియాల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కేవలం 6 పరుగులే ఇచ్చాడు. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరింది.
Details
సూపర్ ఓవర్ లో నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది
సూపర్ ఓవర్‌లో బంగ్లాదేశ్ కేవలం 3 బంతులే ఆడి 6 పరుగులు చేసి ఆలౌటైంది. రెండు వికెట్లు కోల్పోవడంతో సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం ఇన్నింగ్స్ ముగిసింది. మరోసారి అహ్మద్ దనియాల్ అద్భుత బౌలింగ్‌తో మెరిశాడు. తరువాత పాకిస్థాన్ షాహీన్స్ నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కగా, మాజ్ సదఖత్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. భారత్-ఏపై సూపర్ ఓవర్‌లో ఘాటైన విజయం సాధించిన బంగ్లాదేశ్-ఏ, ఫైనల్లో మాత్రం అదే దూకుడును కొనసాగించలేకపోయింది.