IND vs SA: పంత్, ధ్రువ్ జురేల్ ఇద్దరికీ తుది జట్టులో స్థానం ఇవ్వాలి : ఆకాశ్ చోప్రా సలహా
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా(Team India)దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్ స్థానం కోసం వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, యువ క్రీడాకారుడు ధ్రువ్ జురేల్ పోటీ పడుతున్నారు. అయితే ఈ ఇద్దరికీ తుది జట్టులో అవకాశం ఇవ్వాలని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ధ్రువ్ జురేల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో సెంచరీ సాధించిన అతడు, తాజాగా దక్షిణాఫ్రికా 'ఏ' జట్టుతో ముగిసిన అనధికారిక టెస్ట్‌లో భారత్ 'ఏ' తరఫున 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సెలక్టర్లకు తుది జట్టును ఎంపిక చేయడం కష్టసాధ్యమైంది.
Details
నితీష్ కుమార్ రెడ్డిని తప్పించే అవకాశం
ఈ నేపథ్యంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు సలహా ఇస్తూ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు కాబట్టి అతను తప్పనిసరిగా తుది జట్టులో ఉండాలి. ధ్రువ్ జురేల్ కూడా జట్టులో చోటు పొందాలి. అయితే టాప్ ఆర్డర్‌లో సాయి సుదర్శన్ లేదా లోయర్ ఆర్డర్‌లో నితీశ్ కుమార్ రెడ్డి వీరిలో ఒకరిని తప్పించాల్సి రావచ్చు. సాయి సుదర్శన్‌ను మూడో స్థానంలో ఆడించాలి. ప్రస్తుతం ఫామ్‌లో లేని నితీశ్ కుమార్‌ను విశ్రాంతి ఇవ్వడం సమంజసమని పేర్కొన్నాడు. మొత్తానికి, ధ్రువ్ జురేల్ అద్భుత ఫామ్ కొనసాగిస్తుండటంతో, పంత్‌తో కలిసి మొదటి టెస్ట్‌లో ఆడేఅవకాశం దక్కుతుందా అన్నది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.