LOADING...
Pat cummins: మా విజయాల్లో అతడే కీలకం.. మలింగపై కమిన్స్ ప్రశంసలు
మా విజయాల్లో అతడే కీలకం.. మలింగపై కమిన్స్ ప్రశంసలు

Pat cummins: మా విజయాల్లో అతడే కీలకం.. మలింగపై కమిన్స్ ప్రశంసలు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 30, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

వాంఖడే స్టేడియంలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు అనుకూలంగా లేకపోవడంతో ముంబయి జట్టు స్కోరు 250 దాటుతుందని చాలామంది ఊహించారు. కానీ కీలక సమయంలో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ ప్రమాదాన్ని తప్పించగలిగారు. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలమనే నమ్మకం తమ జట్టుకు ముందే ఉందని హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. తమ బ్యాటింగ్ విభాగంపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పాడు.

వివరాలు

మంచి ఫినిషింగ్ ఇచ్చిన సలీల్ అరోరా

"పెద్ద లక్ష్యాన్ని చేధించాలంటే మంచి ఆరంభం చాలా ముఖ్యం. మా బ్యాటింగ్ బలం అందరికీ తెలిసిందే. పైగా పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అందుకే మ్యాచ్ మా చేతిలోనే ఉంటుందని భావించాం. మా బ్యాటర్లు ఆ నమ్మకాన్ని నిలబెట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు ఎలాంటి భయపడకుండా ఆడతారు. అదృష్టవశాత్తూ నేను వారికి బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. వారిని చూస్తేనే భయంగా అనిపిస్తుంది. మా యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. సలీల్ అరోరా చివర్లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అతనికి ఎక్కువ అవకాశాలు రాలేకపోయినా, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఈ విజయానికి కోచింగ్ సిబ్బంది చేసిన కృషి కూడా ఎంతో ముఖ్యమైనది" అని కమిన్స్ వివరించాడు.

వివరాలు

మలింగ వల్లే మ్యాచ్ గెలిచాం..

అదే సమయంలో ఆటలో వచ్చిన మార్పుల గురించి కూడా కమిన్స్ మాట్లాడాడు. "కొన్ని సంవత్సరాల క్రితం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు 12 రన్‌రేట్ ఉన్నా కూడా లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనని అనిపిస్తోంది. అందువల్ల బౌలర్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. నేను గత మ్యాచ్‌లో కూడా ఇదే చెప్పాను..ఇప్పుడు ఎక్కువగా హైస్కోరింగ్ మ్యాచ్‌లే జరుగుతున్నాయి. ఒక మంచి యార్కర్ వేసి ప్రత్యర్థి బ్యాటర్‌ను నిలువరించినా అది గొప్ప విషయమే. మా జట్టులో ఇషాన్ మలింగ లాంటి ప్రతిభావంతమైన బౌలర్ ఉన్నాడు. ఈ సీజన్‌లో మా విజయాల్లో అతనిది కీలక పాత్ర. ప్రస్తుతం అతడే పర్పుల్ క్యాప్‌ను దక్కించుకున్నాడు" అని కమిన్స్ చెప్పాడు.

Advertisement