PCB: పీసీబీకి ఆర్థిక కష్టాలు.. ఛాంపియన్స్ ట్రోఫీతో కోలుకోలేని నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో ఐసీసీ మెగా టోర్నీ (ఛాంపియన్స్ ట్రోఫీ) నిర్వహించిన పాకిస్థాన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది.
లీగ్ దశలోనే పేలవ ప్రదర్శనతో నిష్క్రమించడం ఒక్కటే కాకుండా, భారత్ ఛాంపియన్‌గా నిలవడం పాక్‌కు మరింత అసహనాన్ని కలిగించింది.
అంతేకాకుండా దుబాయ్‌లో ట్రోఫీ ప్రదానోత్సవం సమయంలో పాకిస్థాన్ ప్రతినిధులను పోడియం పైకి ఆహ్వానించకపోవడం దేశానికి అవమానకరంగా మారింది.
మరోవైపు టోర్నీ నిర్వహణ వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB) భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
Details
కేవలం ఒకే ఒక్క మ్యాచ్ స్వదేశంలో!
పాకిస్థాన్ అధికారికంగా టోర్నీ ఆతిథ్య దేశంగా ఉన్నా స్వదేశంలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. లాహోర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది.
అనంతరం దుబాయ్‌లో టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడిపోయింది.
ఇక బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఫలితంగా పాకిస్థాన్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Details
పీసీబీపై భారీ ఆర్థిక భారాలు
ఈ టోర్నీ కోసం పీసీబీ భారీగా ఖర్చు చేసినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి.
రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునీకరణ కోసం 18 బిలియన్ పాకిస్థాన్ రూపాయలు (సుమారు 58 మిలియన్ డాలర్లు) వెచ్చించిందని సమాచారం.
ఇది అంచనా వేసిన బడ్జెట్ కంటే 50 శాతం ఎక్కువని తెలుస్తోంది. అదనంగా ఈవెంట్ సన్నాహాలకు 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
హోస్టింగ్ ఫీజుగా ఐసీసీ నుంచి కేవలం 6 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయని తెలుస్తోంది.
ఇదే కాకుండా, టికెట్ అమ్మకాలు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చిన ఆదాయం చాలా తక్కువగా ఉందని సమాచారం. మొత్తం మీద, ఈ టోర్నీ నిర్వహణతో పీసీబీ సుమారు 85 మిలియన్ డాలర్ల భారీ నష్టాన్ని చవిచూసింది.
Details
ఆటగాళ్ల ఫీజుల్లో భారీ కోత!
నష్టాన్ని తగ్గించేందుకు పీసీబీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నేషనల్ టీ20 ఛాంపియన్‌షిప్‌లో ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును 90 శాతం, రిజర్వ్ ఆటగాళ్ల ఫీజును 87.5 శాతం తగ్గించనుంది.
దీంతో, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు రూ.40,000 నుంచి రూ.10,000కి తగ్గిందని డాన్ పత్రిక వెల్లడించింది.
ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Details
5 స్టార్ హోటల్స్‌కు గుడ్‌బై!
ఫీజుల కోతతో పాటు, ఆటగాళ్ల హోటల్ వసతులను కూడా తగ్గించాలని పీసీబీ నిర్ణయించిందని సమాచారం.
ఇప్పటివరకు 5 స్టార్ హోటళ్లను వాడిన ఆటగాళ్లు ఇకపై ఎకానమీ హోటళ్లలో ఉండాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
దీనిపై తిరిగి సమీక్ష చేయాలని బోర్డు దేశీయ క్రికెట్ విభాగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇలా చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌కు ప్రతిష్ట కంటే నష్టాన్ని ఎక్కువగా మిగిల్చింది.
పీసీబీ ప్రస్తుతం ఈ ఆర్థిక దెబ్బ నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.