Sri Lankan Team: పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన.. స్వదేశానికి వెళ్లిపోతామన్న శ్రీలంక ఆటగాళ్లు..!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్-శ్రీలంక వన్డే సిరీస్ కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు గురువారం స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబు పేలుడులో 12 మంది మరణించడంతో,తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితుల్లో గురువారం రావల్పిండిలో జరగాల్సిన రెండో వన్డే నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. మూడో వన్డే కూడా అదే వేదికపై జరగాల్సి ఉంది.షెడ్యూల్ ప్రకారం ఈ వన్డే సిరీస్ అనంతరం శ్రీలంక జట్టు, పాకిస్థాన్, జింబాబ్వే జట్లతో కూడిన ముక్కోణపు సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది.
వివరాలు
2019 డిసెంబర్‌లో శ్రీలంక పర్యటనతోనే పాకిస్థాన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వేదిక
ఇస్లామాబాద్‌కు అతి సమీపంలో రావల్పిండి ఉండటమే తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన పెరగడానికి ప్రధాన కారణమని శ్రీలంక బోర్డు ఒక అధికారి తెలిపారు. ఈనేపథ్యంలో పాక్-శ్రీలంక సిరీస్ రద్దు అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే,2009లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు వెళ్తున్న శ్రీలంక జట్టు బస్సుపై తీవ్రవాదులు దాడి చేసిన ఘటన ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఆదాడిలో అజంత మెండిస్,చమింద వాస్,మహేల జయవర్దనే వంటి పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు,పలువురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత దాదాపు పది సంవత్సరాల పాటు ఎటువంటి విదేశీ జట్టు పాకిస్థాన్‌లో ఆడేందుకు వెళ్లలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,2019 డిసెంబర్‌లో శ్రీలంక పర్యటనతోనే పాకిస్థాన్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు వేదిక అయింది.