Pro Kabaddi League 2024: అక్టోబర్ 18 నుండి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 ప్రారంభం..
ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 11వ సీజన్ అక్టోబరు 18వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో మూడు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి అంచె పోటీలు అక్టోబరు 18 నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతాయి. రెండో అంచె పోటీలు నవంబరు 10 నుంచి నోయిడా నగరంలో జరుగుతాయి.చివరి అంచె పోటీలు డిసెంబరు 3 నుంచి పుణేలో జరుగుతాయని..పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పీకేఎల్ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు.
తెలుగు టైటాన్స్ జట్టు చివరి స్థానం
ప్రొ కబడ్డీ లీగ్ 2014లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 సీజన్లు జరిగాయి. పుణేరి పల్టన్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ సీజన్‌లో పోటీలోకి దిగనుంది. పట్నా పైరేట్స్ జట్టు మూడు సార్లు టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టు, జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు రెండుసార్లు విజేతగా నిలిచింది. బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, యు ముంబా, పుణేరి పల్టన్ జట్లు ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి. తెలుగు టైటాన్స్ జట్టు రెండు సీజన్లలో మూడో స్థానంలో, నాలుగో సీజన్లో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, గత మూడు సీజన్లలో తెలుగు టైటాన్స్ జట్టు చివరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం.