Loading...
Pakistan cricket: సిరీస్ మధ్యలో ఆటగాళ్ల ఫోన్లు స్వాధీనం.. పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?
సిరీస్ మధ్యలో ఆటగాళ్ల ఫోన్లు స్వాధీనం.. పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?

Pakistan cricket: సిరీస్ మధ్యలో ఆటగాళ్ల ఫోన్లు స్వాధీనం.. పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?

వ్రాసిన వారు Moogati Shabari
Sep 06, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జట్టులోని కొంతమంది ఆటగాళ్ల మొబైల్ ఫోన్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అంతర్గత విచారణలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాక్ క్రికెట్ వర్గాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లో ఉన్న సమయంలో పీసీబీ అధికారులు ఆటగాళ్ల ఫోన్లను తమ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 9న ప్రారంభమయ్యే మూడో, చివరి టెస్టు ముగిసే వరకు ఫోన్లు బోర్డు వద్దే ఉంటాయని తెలుస్తోంది.

వివరాలు

103 పరుగుల తేడాతో ఓడిపోయిన పాక్..

అయితే ఏయే ఆటగాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు? అసలు విచారణకు దారితీసిన కారణాలేంటి? అనే విషయాలను పీసీబీ అత్యంత గోప్యంగా ఉంచింది.

సాధారణంగా యాంటీ కరప్షన్ విచారణలు వంటి అత్యంత తీవ్రమైన సందర్భాల్లోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) లేదా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆటగాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటాయి.

అయితే తాజా వ్యవహారంపై పీసీబీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ పర్యటనలో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది.

లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిపోయిన పాక్.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 194 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది.

వివరాలు

 దారుణ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ కఠిన చర్యలు.. 

ఈ దారుణ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ ఇప్పటికే కఠిన చర్యలు చేపట్టింది.

ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్ సహా ఏడుగురు ఆటగాళ్లను సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పంపించింది.

వారి స్థానంలో సయీమ్ అయూబ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది.

అంతేకాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లను కూడా బాధ్యతల నుంచి తప్పించింది.

వారి స్థానంలో వైట్-బాల్ కోచ్ మైక్ హెస్సన్‌కు బాధ్యతలు అప్పగించింది.

వరుస ఓటములు, ఆటగాళ్లపై వేటు వంటి పరిణామాలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న పాక్ జట్టులో తాజాగా ఫోన్ల స్వాధీనం వ్యవహారం మరిన్ని అనుమానాలు, చర్చలకు దారితీస్తోంది.

జట్టుయాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు, డ్రెస్సింగ్ రూమ్‌లో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT