Virat Kohli: ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే ప్రయోజనం.. కోహ్లీ నిర్ణయంపై రాబిన్ ఉతప్ప ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాంచీ, రాయ్‌పుర్ వేదికలపై వరుస సెంచరీలు కొట్టి తన శక్తి సామర్థ్యాలను మరోసారి నిరూపించాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడటమే తన తదుపరి పెద్ద లక్ష్యంగా కోహ్లీ ముందుకు సాగుతున్నాడు. ఇదే సమయంలో త్వరలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీపై కోహ్లీ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. మొదట ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఆయన నిరాకరించాడని, అయితే తర్వాత సెలక్టర్ల అభ్యర్థన మేరకు అంగీకరించాడని వార్తలు వెలువడ్డాయి. కానీ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదేనని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) స్పష్టం చేశాడు.
Details
విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఇప్పటికే మూడు వారాల క్రితమే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటానని చెప్పేశాడు. అతడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. అతను ఆడతాడా? ఆడడా? అనే ప్రచారాలన్నీ నిరాధార ఊహాగానాలు. కోహ్లీ ఎంత ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే.. అంతగా అతడికి మేలు. రన్స్ సాధించడానికి, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇవి ఎంతో ఉపయోగకరం. మానసికంగా కూడా ఇవి అతడిని సిద్ధం చేస్తాయి. 20 ఏళ్లుగా అతడు ఇదే చేస్తున్నాడు. వన్డే క్రికెట్‌లో కోహ్లీ అసలైన మాస్టర్. ఈ టోర్నమెంట్‌పై నిర్ణయం తీసుకునే సమయంలో కీలక వ్యక్తులతో అతడు ఇప్పటికే మాట్లాడేశాడని ఉతప్ప తన యూట్యూబ్ ఛానల్‌లో వ్యాఖ్యానించాడు.
Details
వన్డేలకే పరిమితమైన కోహ్లీ
ఇప్పటికే విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కేవలం వన్డేలకే పరిమితమయ్యాడు. కొన్ని నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చిన కోహ్లీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. అయితే మూడో వన్డేలో 74 పరుగులతో పుంజుకున్నాడు. ఆ ఫామ్‌ను కొనసాగే కోహ్లీ, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో 135 పరుగులు (120 బంతుల్లో; 11 ఫోర్లు, 7 సిక్స్‌లు), రెండో వన్డేలో 102 పరుగులు (93 బంతుల్లో; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి తన పాత దూకుడు చూపించాడు.