Commonwealth Games 2026: దేశానికి గర్వకారణంగా నిలిచిన ఝండూ కుమార్‌కు ప్రధాని మోదీ అభినందనలు
ఈ వార్తాకథనం ఏంటి
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన పారా పవర్‌లిఫ్టర్ ఝండూ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. హెవీవెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించడం ద్వారా దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై మరింత పెంచారని ప్రశంసించారు. ఝండూ కుమార్ సాధించిన ఈ విజయం అతడి అసాధారణ పట్టుదల, అంకితభావం, నిరంతర కృషికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
వివరాలు
ప్రపంచ వేదికపై ప్రతిభ..
ఎన్నో సంవత్సరాలుగా చేసిన కఠిన సాధనకు ఈ పతకం ప్రతిఫలంగా నిలిచిందని, ఎదురైన ప్రతి సవాల్‌ను అధిగమిస్తూ ప్రపంచ వేదికపై తన ప్రతిభను చాటుకున్నాడని కొనియాడారు.
ఝండూ కుమార్ విజయం దేశంలోని యువతతో పాటు అనేక మంది భారతీయులకు స్ఫూర్తినిస్తోందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఫైనల్లో ఝండూ కుమార్ 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న అతడు, కామన్వెల్త్ గేమ్స్-2026 పతకాల పట్టికలో భారత్ ఖాతాను ప్రారంభించాడు.