PCB: క్రికెట్ మ్యాచ్‌లో రాజకీయ ప్రకంపనలు.. ఇమ్రాన్ కొడుకుల ఇంటర్వ్యూతో పీసీబీకి చిక్కులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ 'స్కై స్పోర్ట్స్' మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూను స్కై స్పోర్ట్స్ ప్రసారం చేయడమే ఇందుకు కారణమైంది. ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేస్తే లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టును బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించింది. అయినప్పటికీ స్కై స్పోర్ట్స్ వెనక్కి తగ్గకపోవడంతో పీసీబీ అధికారికంగా ఫిర్యాదు చేసింది.
వివరాలు
ఏం జరిగిందంటే..!
గురువారం లార్డ్స్ టెస్టు తొలి రోజు లంచ్ బ్రేక్ సమయంలో.. ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్ ఖాన్, ఖాసిమ్ ఖాన్‌లతో మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ నిర్వహించిన ఇంటర్వ్యూను స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "జైలులో ఆయన్ను చంపేందుకు అధికారులు బహిరంగంగానే ప్రయత్నిస్తున్నారు.
వీలైనంత కాలం ఆయన్ను జైలులో ఉంచి, ఆయన గొంతు నొక్కాలని చూస్తున్నారని ఖాసిమ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే.. "మా అత్తలతో మాట్లాడిన చివరిసారి.. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా మారాయని ఆయన చెప్పారు.
గతంలో జైలులో మరణించిన ఇతర రాజకీయ ఖైదీల ఉదంతాలను ఆయన గుర్తుచేసుకుంటున్నారు.
వివరాలు
బెదిరింపులు లెక్కచేయని స్కై స్పోర్ట్స్
రోజులో 23 గంటలకు పైగా ఆయన్ను ఒకే సెల్‌లో ఉంచి పూర్తిగా ఏకాకిని చేశారని ఖాసిమ్ వివరించారు.
ఇంటర్వ్యూ ప్రసారం కావడానికి ముందే పీసీబీ అధికారులు స్కై స్పోర్ట్స్ యాజమాన్యాన్ని సంప్రదించారు.
ఇంటర్వ్యూను ప్రసారం చేయడం ఆపకపోతే.. రెండో సెషన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టరని హెచ్చరించారు.
దీంతో ఇంటర్వ్యూ ప్రసారం కొంత ఆలస్యమైనప్పటికీ.. చివరకు 18 నిమిషాల నిడివి గల సెగ్మెంట్‌ను స్కై స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
అయితే పీసీబీ హెచ్చరికలు చేసినప్పటికీ పాకిస్థాన్ ఆటగాళ్లు యథావిధిగా రెండో సెషన్‌కు మైదానంలోకి వచ్చి మ్యాచ్‌ను కొనసాగించారు.
వివరాలు
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. నేపథ్యం ఇదే
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రపంచకప్ విజేత కెప్టెన్ అయిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు 5న ఓ అవినీతి కేసులో అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మా ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు షిఫా హాస్పిటల్‌కు కాకుండా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీమ్స్)కు వైద్య పరీక్షల కోసం ఇమ్రాన్‌ను తరలించడంపై ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
అయితే భద్రతా కారణాలతోనే ఆయన్ను 'పీమ్స్'కు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నిర్బంధానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.