Rohit- Virat: రో-కోపై క్లారిటీ ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ కీలక సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే కెరీర్ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ, జట్టు యాజమాన్యానికి సూచించాడు . 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో తాము భాగమా? కాదా? అనే విషయంపై ఇద్దరికీ స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశను గుర్తు చేసుకున్న యువరాజ్, ప్రస్తుతం రోహిత్-కోహ్లీ ఎదుర్కొంటున్న పరిస్థితి తాను కూడా గతంలో ఎదుర్కొన్నానని చెప్పాడు.
వివరాలు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
రోహిత్, కోహ్లీ ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితిని నేనూ అనుభవించాను. వారు ఇంకా ఆడాలా? వద్దా? అనే నిర్ణయం అభిమానులది కాదు.
ఆ నిర్ణయం తీసుకోవాల్సింది జట్టు యాజమాన్యం, కోచ్, సెలెక్టర్లే. ఒకవేళ మేనేజ్‌మెంట్ 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ సేవలు కావాలని భావిస్తే, 'మీరు ప్రపంచకప్ వరకు మా ప్రణాళికల్లో ఉన్నారు. మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది.
ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ సహజమైన ఆటను కొనసాగించండి. ఒకటి లేదా రెండు సిరీస్‌లు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా జట్టులో మీ స్థానం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి స్పష్టంగా చెప్పాలని యువరాజ్ పేర్కొన్నాడు.
అలాగే ఆటగాళ్లతో నిజాయితీగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో కూడా యువీ వివరించాడు.
వివరాలు
అప్పట్లో నాకు అలాంటి పరిస్థితే ఎదురైంది
మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు స్పష్టత ఇవ్వాలి. నా కెరీర్ చివర్లో కూడా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ అప్పట్లో నాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఎన్నో సంవత్సరాలు దేశానికి సేవ చేసిన ఆటగాళ్లు ఇలాంటి అనిశ్చితిని ఎదుర్కోవడం బాధాకరం. ఒకవేళ భవిష్యత్ ప్రణాళికల్లో ఎవరైనా లేకపోతే, ఆ విషయాన్ని కూడా నేరుగా, నిజాయితీగా చెప్పాలి.
అలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టమే కావచ్చు. బయటివారికి అది కఠినంగా అనిపించొచ్చు. కానీ ముఖాముఖిగా నిజం చెప్పినందుకు ఆ ఆటగాళ్లు మిమ్మల్ని తప్పకుండా గౌరవిస్తారని యువరాజ్ అభిప్రాయపడ్డాడు.
వివరాలు
సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
ఇదిలా ఉంటే, ఆదివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ 110 బంతుల్లో 138 పరుగులతో అద్భుత శతకం నమోదు చేయగా విరాట్ కోహ్లీ 74 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అయినప్పటికీ భారత్ చివరి వరకు పోరాడి 27 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2తో ఇంగ్లాండ్‌కు అప్పగించాల్సి వచ్చింది.