LOADING...
Virat Kohli- Travis Head: కోహ్లీతో గొడవ.. ట్రావిస్ హెడ్ భార్య సంచలన వ్యాఖ్యలు!
కోహ్లీతో గొడవ.. ట్రావిస్ హెడ్ భార్య సంచలన వ్యాఖ్యలు!

Virat Kohli- Travis Head: కోహ్లీతో గొడవ.. ట్రావిస్ హెడ్ భార్య సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగే చిన్నపాటి వాగ్వాదాలు కొన్నిసార్లు హద్దులు దాటి వారి కుటుంబ సభ్యుల వరకూ చేరుతున్నాయి. తాజాగా ట్రావిస్ హెడ్ విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మైదానంలో జరిగిన మాటల యుద్ధం తర్వాత తీవ్ర ఆన్‌లైన్ వేధింపులకు గురవుతున్నాడు. ముఖ్యంగా కొందరు భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రావిస్ హెడ్‌తో పాటు ఆయన భార్య జెస్సికాను కూడా లక్ష్యంగా చేసుకుని దూషణలు, ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ ఘటనపై జెస్సికా హెడ్ ఆస్ట్రేలియన్ మీడియా సంస్థ 'ది అడ్వర్టైజర్'తో మాట్లాడారు.

వివరాలు

సోషల్ మీడియాలో దూషణలు

గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులే ఇప్పుడు మళ్లీ ఎదురవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రతి ఉదయం లేచేసరికి నా సోషల్ మీడియా ఖాతాలు దూషణలతో నిండిపోతున్నాయి. మేము బాగానే ఉన్నాం కానీ, ఇప్పుడు వాళ్లు మా స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదని తెలిపారు. ఇలాంటి చేదు అనుభవాలు తమకు ఇదే మొదటిసారి కాదని జెస్సికా వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, అలాగే 2024 బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించిన ప్రతిసారీ తమకు బెదిరింపులు వచ్చాయని ఆమె గుర్తుచేశారు.

వివరాలు

వ్యక్తిగత దూషణలకు దిగరాదు

అభిమానులు క్రీడలను ఆస్వాదించాలి కానీ, వ్యక్తిగత దూషణలకు దిగరాదని జెస్సికా హెడ్ సూచించారు. ప్రస్తుతం అన్ని క్రీడల్లో మానసిక ఆరోగ్యం, పరస్పర గౌరవం గురించి చర్చ జరగడం ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. "ఆటలో ఆవేశం సహజమే. కానీ తెర వెనుక ఆటగాళ్లకు కూడా కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ ఘటన తర్వాత అయినా మరింత దయ, పరస్పర మద్దతు పెరగాలని ఆశిస్తున్నాను" అని విజ్ఞప్తి చేశారు. ఇక అసలు వివాదం ఎలా మొదలైందంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ లక్ష్య ఛేదన చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. హెడ్, కోహ్లీని మరింత దూకుడుగా ఆడాలని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Advertisement

వివరాలు

ట్రావిస్ హెడ్ కుటుంబంపై ఆన్‌లైన్ వేధింపులు

దీనికి కోహ్లీ వ్యంగ్యంగా స్పందిస్తూ, "నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చావు కదా.. కావాలంటే నువ్వే వచ్చి బౌలింగ్ చేయ్" అని బదులిచ్చినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా కోహ్లీ ఔటైన తర్వాత కూడా హెడ్ మరో వ్యాఖ్య చేయడంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ చేసుకునే సమయంలో హెడ్ చేయి అందించగా, కోహ్లీ అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం కెమెరాల్లో రికార్డైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అనంతరం ట్రావిస్ హెడ్ కుటుంబంపై ఆన్‌లైన్ వేధింపులు మరింత పెరిగాయి.

Advertisement