Loading...
Quimcy Dsouza: టెక్‌బాల్‌ సెమీస్‌లో క్విమ్సి డిసౌజా ఓటమి.. భారత్‌కు ఇంకా పతక ఛాన్స్‌!
టెక్‌బాల్‌ సెమీస్‌లో క్విమ్సి డిసౌజా ఓటమి.. భారత్‌కు ఇంకా పతక ఛాన్స్‌!

Quimcy Dsouza: టెక్‌బాల్‌ సెమీస్‌లో క్విమ్సి డిసౌజా ఓటమి.. భారత్‌కు ఇంకా పతక ఛాన్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో టెక్‌బాల్‌ (Teqball) మహిళల సింగిల్స్‌లో ఆది నుంచి అద్భుతంగా రాణించిన భారత క్రీడాకారిణి క్విమ్సి డిసౌజా (Quimcy Dsouza) సెమీఫైనల్లో తడబడింది. ఇండోనేసియాకు చెందిన సుమయా చేతిలో ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమితో క్విమ్సి పతక అవకాశాలు ముగిసిపోలేదు. కాంస్య పతకం కోసం ఆమెకు మరో అవకాశం ఉంది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగే పోరులో క్విమ్సి బరిలోకి దిగనుంది. సెమీఫైనల్‌ను క్విమ్సి డిసౌజా అద్భుతంగా ప్రారంభించింది. తొలి సెట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 12-7 తేడాతో విజయం సాధించింది. దీంతో మ్యాచ్‌పై పట్టు సాధించినట్లుగా కనిపించింది. అయితే రెండో సెట్‌లో ఇండోనేసియా క్రీడాకారిణి సుమయా అనూహ్యంగా పుంజుకుంది.

వివరాలు

12-9 తేడాతో సెట్ కైవసం

12-9 తేడాతో ఆ సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను సమం చేసింది.

దీంతో విజేతను నిర్ణయించే మూడో సెట్‌ కీలకంగా మారింది. నిర్ణయాత్మక సెట్‌లోనూ సుమయా ఆధిపత్యం కొనసాగింది.

12-7 తేడాతో మూడో సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దీంతో క్విమ్సి సెమీఫైనల్లో ఓటమి పాలైంది.

అయితే సెమీఫైనల్లో ఓడిన క్రీడాకారిణులకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం ఉండటంతో క్విమ్సికి మరో ఛాన్స్‌ దక్కింది.

ఈ క్రమంలో మూడో స్థానం కోసం జరిగే పోరులో కంబోడియాకు చెందిన కోమ్యేన్ డైతో క్విమ్సి డిసౌజా తలపడనుంది.

ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే క్విమ్సి కాంస్య పతకాన్ని అందుకోనుంది.

వివరాలు

టేబుల్ టెన్నిస్‌ + ఫుట్‌బాల్‌ కలయికే టెక్‌బాల్

టేబుల్ టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ను కలిపి ఆడే ఆటే టెక్‌బాల్‌ (Teqball). టేబుల్‌ టెన్నిస్‌ టేబుల్‌ను పోలిన టేబుల్‌పై ఈ ఆటను ఆడతారు.

అయితే టేబుల్‌ టెన్నిస్‌లో మాదిరిగా చేతులతో కాకుండా శరీరంలోని మిగతా భాగాలతో ఫుట్‌బాల్‌ తరహాలో బంతిని ఆడటం టెక్‌బాల్‌ ప్రత్యేకత.

2017లో తొలిసారిగా టెక్‌బాల్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించారు. భారత్‌లో ఈ ఆట 2018-19లో ప్రవేశించింది.

అప్పటి నుంచి టెక్‌బాల్‌కు దేశంలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈసారి ఆసియా క్రీడల్లో భారత్‌ నుంచి ముగ్గురు క్రీడాకారులు టెక్‌బాల్‌లో బరిలోకి దిగారు.

మహిళల సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ క్విమ్సి డిసౌజా పోటీపడుతోంది. సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించడంతో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లోనూ రాణించేందుకు ఆమె ప్రయత్నిస్తోంది.

ADVERTISEMENT