Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.
ఈ సమావేశానికి కోచ్ రాహుల్ ద్రావిడ్ హాజరు అవుతున్నట్లు తెలిసింది. మామూలుగా సెలక్షన్ కమిటీ సమావేశాలకు కోచ్ హాజరు కావడం చాలా అరుదుగా ఉంటుంది.
ద్రవిడ్ కంటే ముందు ఉన్న కోచ్‌లుగా ఉన్న రవిశాస్త్రి, కుంబ్లే ఒక్కసారి కూడా ఈ సమావేశాలకు హాజరు కాలేదు.
ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ద్రావిడ్ ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.
Details
ఆసియా కప్ కు అదనంగా ఇద్దరు ఆటగాళ్ల ఎంపిక
మరోవైపు ఆసియా కప్‌కు అదనంగా ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మాములుగా అయితే ద్వైపాక్షిక సిరీస్ లకైనా, ఏదైనా టోర్నీలకైనా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేస్తారు. కానీ ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆసియా కప్ లో ఎక్కువ మంది ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించాలనే ఉద్ధేశంతో 17 మందిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న పాకిస్థాన్, శ్రీలంక జట్లు సైతం 17 మంది చొప్పున ఆటగాళ్లను ఎంచుకున్నాయి. ఆసియా కప్ ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది.