 
                                                                                IND vs BAN : చివరి లీగ్ మ్యాచ్ కు వర్షం అంతరాయం.. ఇండియా, బంగ్లా జట్లకు చెరో పాయింట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయైంది. ఆదివారం టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన పోరు భారీ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దయింది. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ చొప్పున కేటాయించారు. ఇప్పటికే సెమీఫైనల్ స్థానాలు ఖరారవడంతో ఈ మ్యాచ్ ప్రాముఖ్యత తక్కువగా ఉన్నా.. భారత జట్టుకు విలువైన ప్రాక్టీస్ అవుతుందని అభిమానులు భావించారు. కానీ వాన దేవుడు ఆ అవకాశం ఇవ్వలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 27 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బంగ్లాదేశ్ 27 ఓవర్లు పూర్తి చేసి 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ (36) జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచింది.
Details
రాణించిన భారత ఓపెనర్లు
శోభనా మోస్త్రే (26) కూడా కొంత ప్రతిఘటన చూపింది. దీనికి ప్రతిగా భారత్‌కు 27 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. చేజింగ్‌లో టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధాన (34 నాటౌట్), అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) అద్భుత ఆరంభం ఇచ్చారు. 8.4 ఓవర్లలోనే భారత్ 57 పరుగులు చేసింది. ఆ సమయంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. వర్షం ఆగకపోవడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్, బంగ్లాదేశ్‌లకు చెరో పాయింట్ లభించింది. ఇక తొలి సెమీఫైనల్‌లో బుధవారం భారత్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లలో విజేతతో తలపడనుంది.
Details
బౌలర్ల బౌలింగ్ షో!
ఆరంభం నుంచే భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలి ఓవర్‌లోనే రేణుకా సింగ్ (1/23) సుమైయా అక్తర్ (2)ను ఔట్ చేసింది. రుబయా హైదర్ (13), షర్మిన్ కలిసి రెండో వికెట్‌కు 31 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలదీశారు. కానీ రుబయా అవుట్ అయిన తర్వాత జట్టు ఒత్తిడికి లోనైంది. నిగర్ సుల్తానా (9) త్వరగా వెనుదిరగడంతో స్కోరు 53/3గా మారింది. ఈ దశలో షర్మిన్‌కు తోడైన శోభనా వేగంగా ఆడుతూ నాలుగు ఫోర్లు బాదింది. కానీ స్పిన్ బౌలర్లు శ్రీచరణి (2/23), రాధా యాదవ్ (3/30) చెలరేగడంతో బంగ్లా బ్యాటింగ్ లైనప్ కూలిపోయింది.
Details
చివర్లో చేతులెత్తేసిన బంగ్లా బ్యాటర్లు
38 పరుగుల భాగస్వామ్యంతో శోభనా ఔట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌లోనే ఆగిపోయారు. షోర్నా అక్తర్ (2), నహిదా అక్తర్ (3), రబేయా ఖాన్ (3), రితూ మోనీ (11) క్రమంగా వెనుదిరిగారు. చివర్లో నిషితా అక్తర్ (4 నాటౌట్), ముర్ఫా అక్తర్ (2 నాటౌట్) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ చెరో వికెట్ తీసి సహకరించారు. మొత్తంగా భారత బౌలర్లు బంగ్లా బ్యాటర్లను కట్టడి చేసి అద్భుత ప్రదర్శన చేశారు.