OCA: ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా రణధీర్ సింగ్
ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడిగా రణ్‌ధీర్ సింగ్ ఎంపికయ్యారు.న్యూఢిల్లీ లో జరిగిన 44వ ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 77ఏళ్ల రణ్‌ధీర్ సింగ్ ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా ఘనత సాధించారు. కువైట్‌కు చెందిన షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ సబా స్థానంలో రణ్‌ధీర్ 2021నుండి తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఏడాది మే నెలలో షేక్ అహ్మద్ పై నైతిక విలువల ఉల్లంఘన కింద 15సంవత్సరాల నిషేధం విధించారు. ఇకపై తాత్కాలికంగా కాకుండా,పూర్తిస్థాయిలో రణ్‌ధీర్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఈ మాజీ షూటర్ అయిదు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.భారత ఒలింపిక్ సంఘం,ఓసీఏలో వివిధ పదవులు చేపట్టారు.ఆయన 2028 వరకు ఓసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.
2026 ఆసియా మెగా క్రీడల్లో యోగా ప్రదర్శన ఈవెంట్
2024-2028 టర్మ్ కోసం రణ్‌ధీర్‌కు 50 శాతానికిపైగా మద్దతు అవసరం కాగా, ఆసియాలోని 45 దేశాల ప్రతినిధులు పూర్తి మద్దతు ఇచ్చారు. 44 మంది రణ్‌ధీర్‌కు మద్దతు ఇచ్చారు, ఒకరు గైర్హాజరయ్యారు. రణ్‌ధీర్ తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జనరల్ అసెంబ్లీలో ఓసీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది.భారతదేశ ప్రాచీన వ్యాయామ పద్ధతి 'యోగా'కు ఆసియా క్రీడల్లో చోటు కల్పించారు. 2026లో జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరిగే ఆసియా మెగా క్రీడల్లో యోగాసనను ప్రదర్శన ఈవెంట్‌గా చేర్చారు. ఈ విషయమై నూతన అధ్యక్షుడు రణ్‌ధీర్ తెలిపారు.అన్ని సభ్య దేశాలను ఒప్పించడానికి పది రోజులు పట్టిందని చెప్పారు. 2030 ఆసియా క్రీడల వరకు యోగాను పతక క్రీడల్లో భాగం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు.