Loading...
Yuvraj Singh: లార్డ్స్‌లో యూవీకి అరుదైన గౌరవం.. ఐకానిక్‌ బెల్‌ మోగించిన పదో భారతీయుడిగా గుర్తింపు
లార్డ్స్‌లో యూవీకి అరుదైన గౌరవం.. ఐకానిక్‌ బెల్‌ మోగించిన పదో భారతీయుడిగా గుర్తింపు

Yuvraj Singh: లార్డ్స్‌లో యూవీకి అరుదైన గౌరవం.. ఐకానిక్‌ బెల్‌ మోగించిన పదో భారతీయుడిగా గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (Yuvraj Singh) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు బ్యాట్‌తో మైదానంలో పరుగుల వరద పారించిన యూవీ.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్‌ (Lord's) మైదానంలోని ప్రతిష్ఠాత్మక 'ఐకానిక్‌ బెల్‌' (Lord's Iconic Bell)ను మోగించే అవకాశం దక్కించుకున్నారు. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆయన ఈ గంటను మోగించి మ్యాచ్‌కు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ గౌరవం అందుకున్న భారతదేశానికి చెందిన పదో క్రికెటర్‌గా యువరాజ్‌ చరిత్రలో నిలిచారు. లార్డ్స్‌ మైదానంలోని ఐకానిక్‌ బెల్‌కు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 1884లో జాన్‌ వార్నర్‌ అండ్‌ సన్స్‌ దీనిని ఏర్పాటు చేశారు.

వివరాలు

మ్యాచుకు ముందు గంట మోగించడం సంప్రదాయం

2007 నుంచి లార్డ్స్‌లో జరిగే మ్యాచ్‌లకు ముందు క్రికెట్‌కు విశేష సేవలందించిన దిగ్గజ ఆటగాళ్ల చేత ఈ గంటను మోగించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఈ గౌరవం అందుకోవడం ప్రతి క్రికెటర్‌కు ప్రత్యేక గుర్తింపుగా భావిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం అందుకున్న తొలి భారత క్రికెటర్‌ నవాబ్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ (Mansur Ali Khan Pataudi). ఆయన తర్వాత 2007లో సునీల్‌ గవాస్కర్‌ ఐకానిక్‌ బెల్‌ను మోగించారు.

అనంతరం 2018లో సౌరవ్‌ గంగూలీ, సంజయ్‌ మంజ్రేకర్‌ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

2025లో సచిన్‌ టెండూల్కర్‌, ఛతేశ్వర్‌ పుజారాతో పాటు భారత మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ (Mithali Raj) కూడా లార్డ్స్‌లో ఐకానిక్‌ బెల్‌ను మోగించారు.

వివరాలు

మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్‌ ఈ గౌరవం

మహిళా క్రికెటర్లలో ఈ గౌరవం అందుకున్న ఏకైక భారతీయురాలిగా మిథాలీ రాజ్‌ నిలిచారు.

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య మూడో వన్డే సందర్భంగా యువరాజ్‌ సింగ్‌ ఐకానిక్‌ బెల్‌ను మోగించగా.. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన లార్డ్స్‌ మైదానంలో ఆ క్షణం అభిమానులను ఆకట్టుకుంది.

ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన భార్య హేజల్‌ కీచ్‌ ఆనందానికి అవధులు లేకుండా కనిపించారు.

ఇటీవల వారం క్రితం జరిగిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రాయల్‌ బాక్స్‌లో సందడి చేసిన యువరాజ్‌ సింగ్‌కు.. ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ECB), లార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేక ఆహ్వానం పంపడంతో మూడో వన్డేను వీక్షించేందుకు ఆయన లండన్‌కు చేరుకున్నారు.

ADVERTISEMENT