
RCB: ఆర్సీబీనే గుమిగూడే పరిస్థితిని సృష్టించింది.. పోలీసుల తప్పేమీ లేదు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (RCB) గెలిచిన నేపథ్యంలో జూన్ 4న బెంగళూర్‌లో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాతపడగా, అనేక మంది గాయపడ్డారు. ట్రిబ్యునల్ వ్యాఖ్యానిస్తూ, ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా ఆర్సీబీకే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. CAT ప్రకారం, మూడు నుంచి ఐదు లక్షల ప్రజలు ఒకేచోట గుమికూడే పరిస్థితిని సృష్టించినా, ఆర్సీబీ మాత్రం తగిన ఏర్పాట్లు చేయలేదు. అవసరమైన పోలీసు అనుమతులు తీసుకోకుండానే కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రకటించడం వల్లే ప్రజలు భారీగా వచ్చారని ట్రిబ్యునల్ పేర్కొంది
Details
ఆర్సీబీ నిర్లక్ష్యమే కారణం
. ఇంత పెద్ద స్థాయిలో పబ్లిక్ ఈవెంట్‌ను నిర్వహించాలంటే ముందస్తు అనుమతులు, తగిన ఏర్పాట్లు అవసరం. కానీ ఆర్సీబీ చివరి నిమిషంలో ఈ విజయోత్సవం గురించి ప్రకటించింది. అలా చేయడం ద్వారా ప్రజల మధ్య కలవరం సృష్టించిందని ట్రిబ్యునల్ ఆక్షేపించింది. ట్రిబ్యునల్ పోలీసుల వైఖరిని సమర్థించింది. పోలీసులు కూడా మనుషులే గానీ, దేవుళ్లు కాదు. అల్లాద్దీన్ దీపం లాంటి అద్భుత శక్తులు వారికి లేవు. కేవలం 12 గంటల వ్యవధిలో అంతటి భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం సాధ్యపడదు. తగిన సమయం ఇవ్వకుండా వారిపై విమర్శలు చేయడం న్యాయమైనది కాదని స్పష్టం చేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యతను ఆర్సీబీపై వేస్తూ,వారి నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసిందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.