లక్నోపై విజయంతో టాప్-5లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ
అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో లక్నోపై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 5 కి ఆర్సీబీ ఎగబాకింది. తొమ్మిది మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో పది పాయింట్లు సాధించి పంజాబ్ కింగ్స్ ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి ఆర్సీబీ చేరింది. మరోవైపు బెంగళూరు చేతిలో ఓటమిపాలైన లక్నో మూడో స్థానం మాత్రం మారలేదు. లక్నో తొమ్మిది మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ఇక ఎనిమిది మ్యాచ్ ల్లో ఆరు విజయాలతో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఇక చివరి మూడు స్థానాల్లో కోల్ కతా, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచాయి.
ఆరెంజ్ క్యాప్ లీడ్ లో డుప్లెసిస్
ఇక ఆరెంజ్ క్యాప్ లో లీడ్ లో యశస్వీ జైస్వాల్ ను ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అధిగమించారు. 9 మ్యాచ్ ల్లో 466 పరుగులు చేసి డుప్లెసిస్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. యశస్వీ జైస్వాల్ 428, డేవాన్ కాన్వే 414, కోహ్లీ 364 పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచారు. పర్పుల్ క్యాప్ జాబితాలో చైన్నై పేసర్ తుషార్ దేశ్ పాండ్ 17 వికెట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక లక్నోపై ఒక వికెట్ తీసిన సిరాజ్.. ఈ సీజన్లో మొత్తం 15 వికెట్లు పడగొట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. రషీద్ ఖాన్ 14 వికెట్లు, అశ్విన్ 13 వికెట్లతో టాప్ 5లో కొనసాగుతుండడం విశేషం.