RCB For Sale: ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన ఫ్రాంఛైజీ.. కొనుగోలు చేసేందుకు ప్రధాన వ్యాపారదారులు పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి ట్రోఫీ దక్కించుకున్న సంవత్సరమే ఆ ఫ్రాంచైజీకి చేదు అనుభవాలను మిగిల్చింది. ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోవడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆ ఘటన తర్వాతే జట్టును అమ్మేయాలన్న ఆలోచనలు ప్రారంభమయ్యాయని వార్తలు వినిపించాయి. తాజాగా ఆర్సీబీని పూర్తిగా విక్రయించేందుకు యాజమాన్య సంస్థ అయిన డయాజియో చర్యలు మొదలుపెట్టడంతో.. ఫ్రాంచైజీని ఎవరు కొనుగోలు చేస్తారన్నది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఐపీఎల్‌లో అత్యధిక ప్రజాదరణ కలిగిన జట్లలో ఆర్సీబీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ జట్టు మార్కెటింగ్ వ్యూహాలు కూడా భారీ స్థాయిలో సాగుతాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లి వ్యక్తిగత బ్రాండ్ విలువ,ఆ జట్టు బ్రాండ్ వ్యాల్యూను మరింత పెంచుతుంది.
వివరాలు
ఆర్సీబీ కొనుగోలులో ప్రస్తుతానికి ఐదు పెద్ద కంపెనీలు ఆసక్తి
అభిమానుల సంఖ్య, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాల వల్ల ఆర్సీబీ విలువ సంవత్సరానికొకసారి మరింత పెరుగుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా అదానీ గ్రూప్ పేరు వినిపించడం ప్రత్యేకంగా మారింది. ఆర్సీబీ కొనుగోలులో ప్రస్తుతానికి ఐదు పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ, భారతదేశంలోని అగ్ర ధనవంతుల్లో ఒకటైన అదానీ గ్రూప్, ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న జిందాల్ గ్రూప్, తోడు అదర్ పూనావాలా, రవి జైపూరియా వంటి శక్తివంతమైన వ్యాపారవేత్తలు ఈ పోటీలో ఉన్నారు. ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ మాత్రమే కాదు..బృహత్తర వ్యాపారం కూడా.
వివరాలు
ఐపీఎల్‌లో మరో కొత్త అధ్యాయం తెరపైకి తెచ్చే అవకాశం
ప్లేయర్ల వేలం నుండి సీజన్ ముగిసే వరకు భారీ మొత్తంలో డబ్బు చలామణి అవుతుంది. జట్టు ర్యాంకులు ఏవైనా ఉండొచ్చు,కానీ ప్రకటనలు,కమర్షియల్ కాంట్రాక్టులు,బ్రాండ్ టైఅప్స్ రూపంలో వందల కోట్ల రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. ఈ లాభదాయక బిజినెస్ మోడల్ కావడం వల్లే కార్పొరేట్ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఒకవేళ ఆర్సీబీ అదానీ గ్రూప్ చేతికి వెళ్తే..ముంబై ఇండియన్స్ యజమాని అంబానీకి సూటిగా బిజినెస్ పరంగానే కాకుండా జట్టు నిర్మాణంలో కూడా పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. మంచి ఆటగాళ్ల కోసం ఏ ధర అయినా వెనుకాడని అంబానీలా,అదానీ కూడా భారీగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆ పోటీ ఐపీఎల్‌లో మరో కొత్త అధ్యాయం తెరపైకి తెచ్చే అవకాశం ఉంది.