Unbreakable Cricket Records: క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ బద్దలు కొట్టిన రికార్డులివే!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అంటే రికార్డుల ఆటనే చెప్పాలి. ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టించబడుతుంటే, పాతవి బద్దలవుతూనే ఉంటాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం కాలం మారినా, తరాలు మారినా ఎవరూ బద్దలు కొట్టలేనివిగా నిలిచిపోయాయి. అలాంటి నాలుగు అద్భుత రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Details
జాక్ హాబ్స్ - ఫస్ట్ క్లాస్ సెంచరీలతో రికార్డు
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జాక్ హాబ్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ కూడా హాబ్స్ రికార్డుకు దగ్గరగా రాలేకపోయాడు. 1905 నుంచి 1934వరకు కొనసాగిన 29 ఏళ్ల కెరీర్‌లో హాబ్స్ 834ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 61,760 పరుగులు చేశారు. ఇందులో 199 సెంచరీలు, 273 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని గరిష్ట స్కోరు 316 నాటౌట్. టెస్ట్ క్రికెట్‌లో కూడా 61 మ్యాచ్‌ల్లో 5,410 పరుగులు (15సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు) చేసి 56 సగటు నమోదు చేశారు. ఫస్ట్-క్లాస్‌లో హాబ్స్ చేసిన ఈ సెంచరీల రికార్డును నేటి తరం ఎవరైనా అధిగమించడం దాదాపు అసాధ్యం
Details
డాన్ బ్రాడ్‌మాన్ - అప్రతిహతమైన సగటు
ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఒకే రికార్డు గుర్తుకు వస్తుంది - టెస్ట్ క్రికెట్‌లో 99.94 సగటు. ఈ అద్భుత రికార్డుకు ఇప్పటివరకు ఎవరూ దగ్గర కూడా రాలేదు. చివరి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసినా అతని సగటు 100 అయ్యేది కానీ దురదృష్టవశాత్తు బ్రాడ్‌మాన్ డకౌట్ అయ్యాడు. మొత్తం 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6,996 పరుగులు చేసిన ఈ మహానుభావుడి రికార్డు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
Details
రోహిత్ శర్మ - వన్డేల్లో రికార్డు ఇన్నింగ్స్
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును తన పేరుపై దక్కించుకున్నాడు. 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ రికార్డు ఈ రోజుకీ ఎవరూ దాటలేకపోయారు. అంతేకాదు, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా రోహిత్ శర్మే. ఇప్పటివరకు మరెవరూ వన్డేల్లో రెండుసార్లకన్నా ఎక్కువ డబుల్ సెంచరీలు చేయలేకపోయారు.
Details
జిమ్ లేకర్ - ఒక్క మ్యాచ్‌లో 19 వికెట్లు!
ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్ టెస్ట్‌లో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో లేకర్ మొత్తం 19 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 9, రెండవ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు! టెస్ట్ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో ఇంతటి ఘనత సాధించిన బౌలర్ ఇప్పటివరకు ఎవరూ లేరు. ఒక బౌలర్ రెండు ఇన్నింగ్స్‌ల్లో అన్ని వికెట్లు పడగొట్టడం అనే ఈ రికార్డు సమీప భవిష్యత్తులో ఎవరికీ సాధ్యమవడం కష్టమే. ఈ నాలుగు రికార్డులు క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో చెరగని ముద్ర వేశాయి. సాంకేతికత, శిక్షణ, వ్యూహాలు ఎంత అభివృద్ధి చెందినా, ఈ రికార్డులు మాత్రం ఎప్పటికీ బద్దలయ్యే అవకాశం చాలా తక్కువ.