Rinku Singh : రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం.. కాలేయ క్యాన్సర్‌తో పోరాడి తండ్రి ఖచంద్ర కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో మృతి చెందారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖచంద్ర ఆరోగ్యం గత కొన్ని రోజులుగా మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ప్రత్యేక వైద్యం అందించారు. అయితే క్యాన్సర్ నాలుగో దశలో ఉండటంతో శరీరం చికిత్సకు సహకరించక చివరకు కన్నుమూశారు.
వివరాలు
జట్టును విడిచి స్వస్థలానికి రింకూ
ఇటీవలి రోజుల్లో ఖచంద్ర సింగ్ ఆరోగ్యం అకస్మాత్తుగా దిగజారడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇదే సమయంలో టీ20 వరల్డ్‌కప్ 2026లో పాల్గొంటున్న రింకూ సింగ్‌కు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందింది. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన జట్టును విడిచి స్వగ్రామానికి బయలుదేరాడు. వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఖచంద్ర ఆరోగ్య పరిస్థితి స్థిరపడలేదు.
వివరాలు
రింకూ టీ20 వరల్డ్‌కప్ 2026లో కొనసాగుతాడా..
రింకూ సింగ్ తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. తండ్రి మరణంతో రింకూ టీ20 వరల్డ్‌కప్ 2026లో కొనసాగుతాడా లేదా అన్నది సందేహంగా మారింది. అతని స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో గుర్తింపు పొందిన రింకూ సింగ్ ప్రస్తుతం భారత జట్టులో ఫినిషర్ పాత్రను విజయవంతంగా నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.