Page Loader
Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలం..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడంపై మౌనం వీడిన రిషబ్ పంత్ 
ఐపీఎల్ మెగా వేలం..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడంపై మౌనం వీడిన రిషబ్ పంత్

Rishabh Pant: ఐపీఎల్ మెగా వేలం..ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడడంపై మౌనం వీడిన రిషబ్ పంత్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
02:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా జెడ్డాలో నిర్వహించనున్నారు. ఈ వేలం భారత కాలమానం ప్రకారం నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. మెగా వేలం నేపథ్యంలో క్రికెట్ అభిమానుల దృష్టి ప్రధానంగా రిషబ్ పంత్ పై ఉంది. అతడి కోసం అత్యధిక ధర పలుకుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు పంత్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు భారీ మొత్తాలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను ఈసారి ఫ్రాంఛైజీ రిటైన్ చేయలేదు. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

గావస్కర్ విశ్లేషణ 

ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో స్పందించారు. పంత్‌ను రిటైన్ చేయకపోవడానికి కారణం రిటెన్షన్ ఫీజుకు సంబంధించిన విభేదమే అని ఆయన అభిప్రాయపడ్డారు. "పంత్ ఫ్రాంఛైజీతో రిటెన్షన్ ఫీజు విషయంలో ఏదో అభిప్రాయ బేధం ఉండొచ్చు," అని గావస్కర్ పేర్కొన్నారు. దీనిపై రిషభ్ పంత్ సోషల్ మీడియాలో స్పందించాడు. తన రిటెన్షన్ నిర్ణయానికి డబ్బుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా వెల్లడించాడు. "నా రిటెన్షన్ అంశం డబ్బు కారణంతో ముడిపడి లేదని తేల్చి చెప్పగలను," అని పంత్ గావస్కర్ వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించాడు.

వివరాలు 

పంత్‌ను తిరిగి తీసుకునేందుకు దిల్లీ ఆసక్తి 

గావస్కర్ అభిప్రాయం ప్రకారం, దిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయట. ''దిల్లీ రిషభ్ పంత్‌ను తమ జట్టులోకి తిరిగి తీసుకోవాలని ఖచ్చితంగా ఆశిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆటగాడిని రిటైన్ చేయడం కంటే వేలం ద్వారా కొనడం వ్యూహాత్మకంగా మంచిది. పంత్‌ను దక్కించుకోవడం ద్వారా దిల్లీ కెప్టెన్సీ సమస్యను పరిష్కరించుకోవచ్చు,'' అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా పంత్ చుట్టూ సాగే ఈ ఆసక్తికర కథనం, జట్టుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాలి.