LOADING...
Rishab pant: రూ. 27 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు తగ్గిన వేతనం.. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్న పంత్!
రూ. 27 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు తగ్గిన వేతనం.. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్న పంత్!

Rishab pant: రూ. 27 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు తగ్గిన వేతనం.. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్న పంత్!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 20, 2026
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు కొనుగోలు చేయబడిన ఆటగాడిగా నిలిచిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్, తన వేతనంలో గణనీయమైన కోతకు అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తరఫున ఆడుతున్న పంత్, ట్రేడ్ విధానం ద్వారా తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)లోకి తిరిగి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి మారనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

స్వచ్చందంగా తగ్గించుకున్న వేతనం..

సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో లక్నో ఫ్రాంచైజీ రిషబ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే అతని నాయకత్వంలో జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 2025 సీజన్‌లో ఎల్ఎస్‌జీ ఏడో స్థానంతో సరిపెట్టుకోగా, 2026 సీజన్‌లో చివరి స్థానమైన పదో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో పంత్‌ను ట్రేడ్ చేసేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు సమాచారం. క్రిక్‌బజ్ కథనం ప్రకారం, ఈ ట్రేడ్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే లక్నో యాజమాన్యంతో చర్చలు జరిపింది. ఈ ఒప్పందంలో ప్రధాన ఆకర్షణ పంత్ తన జీతాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకోవడమే.

వివరాలు

రూ.15 కోట్లకు తగ్గింపు..

ప్రస్తుతం అతను పొందుతున్న రూ. 27 కోట్ల వేతనాన్ని భరించడం ఢిల్లీకి కష్టంగా ఉండటంతో, దాన్ని సుమారు రూ. 15 కోట్లకు తగ్గించుకోవడానికి పంత్ అంగీకరించినట్లు నివేదిక పేర్కొంది. అంటే ప్రస్తుతం తీసుకుంటున్న వేతనంలో సగానికి కొద్దిగా ఎక్కువ మొత్తానికే ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక లక్నో జట్టులోకి వెళ్లనున్న కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే, అతని ప్రస్తుత వేతనం రూ. 13.25 కోట్లలో ఎలాంటి మార్పు ఉండదని నివేదిక వెల్లడించింది.

Advertisement

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన..

ఈ ట్రేడ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు తమకు అనుబంధం ఉన్న జట్లలోకి చేరనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రిషబ్ పంత్ గతంలో వరుసగా తొమ్మిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ తన సొంత రాష్ట్ర ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ కీలక ట్రేడ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముందని సమాచారం.

Advertisement