LOADING...
Riyan Parag: ఐపీఎల్‌లో కొత్త మైలురాయి అందుకున్న రియాన్ పరాగ్.. 100 సిక్సర్ల క్లబ్‌లో ఎంట్రీ
ఐపీఎల్‌లో కొత్త మైలురాయి అందుకున్న రియాన్ పరాగ్.. 100 సిక్సర్ల క్లబ్‌లో ఎంట్రీ

Riyan Parag: ఐపీఎల్‌లో కొత్త మైలురాయి అందుకున్న రియాన్ పరాగ్.. 100 సిక్సర్ల క్లబ్‌లో ఎంట్రీ

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
11:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మరోసారి బ్యాట్‌తో మెరిశాడు. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన పరాగ్.. కేవలం 26 బంతుల్లోనే 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ దిశగా నడిపించాడు. రాజస్థాన్ రాయల్స్ 89/2 స్కోర్ వద్ద పరాగ్ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వేగంగా 46 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించాడు. ఆ తర్వాత వచ్చిన పరాగ్ అదే జోరును కొనసాగించాడు. మరో ఎండ్‌లో ధ్రువ్ జురెల్ మంచి సహకారం అందించడంతో ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు వేగంగా 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

వివరాలు

ఐపీఎల్ రికార్డులు ఇవే..

పరాగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. గ్యాప్‌లలో చక్కటి షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే 15వ ఓవర్‌లో మిచెల్ స్టాక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యే సమయానికి రాజస్థాన్ స్కోర్ 161/3గా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో పరాగ్ 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. అతని స్ట్రైక్‌రేట్ 196.15గా నమోదైంది. ఈ అర్ధశతకంతో పరాగ్ ఐపీఎల్‌లో తన 9వ ఫిఫ్టీని నమోదు చేశాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతడు 1,824 పరుగులు సాధించాడు. అతని సగటు 26.05గా ఉంది.

వివరాలు

ఐపీఎల్‌లో 100 సిక్సర్ల మార్క్‌..

ఇంకా ఈ మ్యాచ్‌లో పరాగ్ మరో అరుదైన మైలురాయిని కూడా అందుకున్నాడు. ఐపీఎల్‌లో 100 సిక్సర్ల మార్క్‌ను దాటిన ఆటగాడిగా నిలిచాడు. తన తొలి సిక్సర్‌తోనే ఈ ఘనత సాధించిన పరాగ్ ప్రస్తుతం మొత్తం 104 సిక్సర్లు నమోదు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా అతడికి మంచి రికార్డు ఉంది. ఆ జట్టుపై 13 మ్యాచ్‌ల్లో 335 పరుగులు సాధించిన పరాగ్ నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ తరఫున 100కి పైగా సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్‌గా పరాగ్ నిలిచాడు. ఈ జాబితాలో సంజు శాంసన్, జోష్ బట్లర్, షేన్ వాట్సన్, యశస్వీ జైశ్వాల్ ఇప్పటికే ఉన్నారు.

Advertisement