Roger Federer:'నీ అంతగా మరెవరూ సవాలు విసరలేదు'.. నాదల్‌కు ఫెదరర్ భావోద్వేగ లేఖ
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌తో పోటీ వల్లే తన ఆటను మరింత ఆస్వాదించగలిగానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేర్కొన్నారు. నాదల్ జరిపిన టెన్నిస్ ప్రయాణం ఎంతో గొప్పదేనని, 14 ఫ్రెంచ్ ఓపెన్స్ గెలవడం చరిత్రలో నిలిచిపోయే విజయమని ఫెదరర్ ప్రశంసించారు. నాదల్ తన ఆటతో స్పెయిన్‌తో పాటు మొత్తం టెన్నిస్ ప్రపంచాన్ని గర్వపడేలా చేశాడని తెలిపారు. డేవిస్ కప్ తన చివరి టోర్నీ అని ప్రకటించిన నాదల్, మంగళవారం భావోద్వేగంగా కోర్టులోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభానికి ముందు, ఫెదరర్ ఒక భావోద్వేగ లేఖ రాశారు.
14 ఫ్రెంచ్ ఓపెన్స్ గెలవడం ఓ చరిత్రాత్మక ఘట్టం
"రఫా, నువ్వు నన్ను చాలా సార్లు ఓడించావు. నేను నిన్ను ఓడించిన దానికంటే ఎక్కువసార్లు నువ్వు నన్ను ఓడించావు. నీ కంటే నాకెవరూ పెద్ద సవాలుగా నిలవలేదు. మట్టి కోర్టులో నీతో ఆడుతున్నప్పుడు అది నీ అడ్డాలో ఆడుతున్నట్లు అనిపించేది. నువ్వు నాకు ఊహించని స్థాయిలో కృషి చేయించేలా చేశావు. నువ్వే నా రాకెట్ హెడ్ పరిమాణాన్ని మార్చేలా చేశావు. నాకు ఆటపై మరింత ప్రేమను నువ్వే కలిగించావు. 14 ఫ్రెంచ్ ఓపెన్స్ గెలవడం ఓ చరిత్రాత్మక ఘట్టం. నువ్వు టెన్నిస్ ప్రపంచానికే గర్వకారణంగా నిలిచావు." అని రోజర్ ఫెదరర్ లేఖలో పేర్కొన్నారు.
'క్లే కింగ్'గా పేరు తెచ్చుకున్న నాదల్
"నేను ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు నువ్వు నా పక్కన ఉండటం నాకు గొప్ప అనుభూతిని కలిగించింది. ఆ రోజు కోర్టులో నీతో కలిసి గడిపిన ఆ క్షణాలు, నీతో పంచుకున్న భావోద్వేగాలు నాకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఇప్పుడు నీ చివరి పోరుపై దృష్టి సారించావని తెలుసు. ఆ పోరు ముగిసిన తరువాత మనం మాట్లాడుకుందాం. నీ పాత స్నేహితుడిగా ఎప్పుడూ నీ విజయాలను ఆకాంక్షిస్తాను." అని ఫెదరర్ తన లేఖలో రాశారు. నాదల్, రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, వారి స్నేహం ఎంతో అనుబంధంతో కూడుకున్నది. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించి 'క్లే కింగ్'గా పేరు తెచ్చుకున్న నాదల్ ఆట చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని టెన్నిస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.