Rohit Sharma: వడాపావ్ తింటావా.. రోహిత్ భయ్యా!: ఆట పట్టించిన ఫ్యాన్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ హజారే ట్రోఫీ పోటీల్లో భాగంగా జైపూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి, సిక్కిం జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబయి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్‌లో ముంబయి తరఫున టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన రోహిత్, చివరికి 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు గాను 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు కూడా దక్కింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది.
వివరాలు
రోహిత్ అన్నా.. వడాపావ్ తింటావా?
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు మైదానానికి తరలివచ్చారు. రోహిత్ శర్మకు మద్దతుగా 'ముంబయి రాజా' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని కొంచెం భిన్నంగా స్పందిస్తూ రోహిత్‌ను సరదాగా ఆటపట్టించాడు. 'రోహిత్ భాయ్... వడాపావ్ కాయేగీ క్యా?' (రోహిత్ అన్నా.. వడాపావ్ తింటావా?)అంటూ అరవగా,రోహిత్ కూడా ఎంతో స్పోర్టివ్‌గా స్పందించాడు. తినను అన్నట్టుగా చేతితో సంజ్ఞ చేయడంతో అభిమానులంతా ఒక్కసారిగా హర్షధ్వానాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. ఇటీవల రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. దాదాపు పది కిలోల వరకు బరువు తగ్గి, కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నాడు.
వివరాలు
జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా రోహిత్
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన టీమిండియా-దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న జైస్వాల్, రోహిత్‌కు కూడా కేక్ ఆఫర్ చేశాడు. అయితే రోహిత్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ,'కేక్ తింటే మళ్లీ లావైపోతాను'అని చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. సాధారణంగా రోహిత్ శర్మకు వడాపావ్ అంటే ఎంతో ఇష్టమని అభిమానులకు తెలిసిందే. అయితే ప్రస్తుతం అతడు జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా తన ఫిట్‌నెస్,ఆటపై పూర్తిగా దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నాడు.