LOADING...
Rohit Sharma : బుల్లితెరపైకి రోహిత్‌ శర్మ ఎంట్రీ
బుల్లితెరపైకి రోహిత్‌ శర్మ ఎంట్రీ

Rohit Sharma : బుల్లితెరపైకి రోహిత్‌ శర్మ ఎంట్రీ

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ సిక్సర్లు, ఆకట్టుకునే బ్యాటింగ్‌తో అభిమానులను అలరించే హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ త్వరలో కొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టెలివిజన్‌ రంగంలో అడుగుపెడుతూ ఓ ప్రత్యేక షో ద్వారా బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించిన టీజర్‌ తాజాగా విడుదలై సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ టీజర్‌ను సోనీ పిక్చర్స్ విడుదల చేసింది. రోహిత్‌ శర్మకు ఎంతో ప్రసిద్ధి చెందిన 'గార్డెన్‌లో ఎవరూ తిరగకూడదు' అనే డైలాగ్‌ను ప్రధాన ఆకర్షణగా ఉపయోగించడం వీడియోకు మరింత హైలైట్‌గా నిలిచింది. టీజర్‌లో రోహిత్‌ ఒకచోట కూర్చుని ఉండగా అభిమానులు అతని ఆటోగ్రాఫ్‌ కోసం చేరుకుంటారు. అయితే వారంతా ఆటోగ్రాఫ్‌తో 'గార్డెన్‌' డైలాగ్‌ చెప్పాలని కోరుతుండటంతో రోహిత్‌ కొంత అసహనంగా కనిపిస్తాడు.

వివరాలు

అభిమానుల ఎదురుచూపు..

చివర్లో బయటకు వస్తూ, ''నేను చెప్పిన రెండు లైన్లే ఇంత వైరల్‌ అయ్యాయి. ఇక పూర్తి షో విడుదలైతే ఎలా ఉంటుందో ఊహించండి'' అని చెప్పిన మాటలు టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 'అత్యంత భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ డెబ్యూకు సిద్ధంగా ఉండండి' అంటూ సోనీ టీవీ ఈ టీజర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది. అదే వీడియోను రోహిత్‌ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ, 'గార్డెన్‌ పని చాలించింది.. ఇక కొత్తగా ఏదైనా ప్రారంభిద్దాం' అని క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రోహిత్‌ కామెడీ టైమింగ్‌ను చూసిన అభిమానులు 'బ్లాక్‌బస్టర్‌ ఖాయం', 'ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వివరాలు

డైలాగ్‌తో అదరగొట్టిన రోహిత్..

అయితే ఇది టాక్‌ షోనా, కామెడీ ప్రోగ్రామా లేదా రియాల్టీ గేమ్‌ షోనా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక 2024లో జరిగిన ఓ టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా రోహిత్ శర్మ తన సహచర ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫీల్డ్‌లో ఆటగాళ్లు నెమ్మదిగా కదులుతుండటాన్ని గమనించిన అతడు, 'మనం గార్డెన్‌లో తిరగడానికి రాలేదు' అంటూ వారిని హెచ్చరించాడు. ఆ సంఘటన తర్వాత నుంచి 'గార్డెన్‌' అనే డైలాగ్‌ సోషల్‌ మీడియాలో విపరీతమైన గుర్తింపు పొందింది.

Advertisement