LOADING...
Vaibhav Sooryavanshi: ఒకే సీజన్‌లో 43 సిక్సర్లు.. ఐపీఎల్‌లో వైభవ్ అరుదైన రికార్డు
ఒకే సీజన్‌లో 43 సిక్సర్లు.. ఐపీఎల్‌లో వైభవ్ అరుదైన రికార్డు

Vaibhav Sooryavanshi: ఒకే సీజన్‌లో 43 సిక్సర్లు.. ఐపీఎల్‌లో వైభవ్ అరుదైన రికార్డు

వ్రాసిన వారు Moogati Shabari
May 17, 2026
11:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024 సీజన్‌లో 42 సిక్సర్లు కొట్టగా.. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఆ మార్క్‌ను దాటేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ 62లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి.

వివరాలు

ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి..

యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయిన తర్వాత 19/1 స్కోర్ వద్ద క్రీజ్‌లోకి వచ్చిన వైభవ్.. ధృవ్ జురెల్‌తో కలిసి రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొదటి బంతి నుంచే దూకుడు చూపించిన వైభవ్ సూర్యవంశీ.. లుంగి ఎన్‌గిడి బౌలింగ్‌లో సిక్సర్‌తో తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్‌పై కూడా ఎదురుదాడికి దిగాడు. త్రిపురాణ విజయ్ బౌలింగ్‌లోనూ భారీ షాట్లు ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే 8వ ఓవర్‌లో మాధవ్ తివారి బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు.

వివరాలు

12 మ్యాచుల్లో 486 పరుగులు..

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 486 పరుగులు సాధించాడు. అతడి సగటు 40.50గా ఉంది. ఈ సీజన్‌లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక బౌండరీల విషయానికి వస్తే.. 43 ఫోర్లు, 43 సిక్సర్లు బాదాడు. అతడి స్ట్రైక్ రేట్ 234.78గా ఉంది. ఈ రికార్డుతో ఒక ఐపీఎల్ సీజన్‌లో 40కి పైగా సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మాత్రమే నిలిచారు.

Advertisement